Nitish Kumar: అలాగైతే భాజపా 100 స్థానాలకు పడిపోవడం ఖాయం: నీతీశ్‌ కుమార్‌

కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ కలిసి యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ కోరారు. తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను 100 సీట్లకే పరిమితం చేయొచ్చని అన్నారు.

Published : 18 Feb 2023 20:15 IST

పట్నా: కేంద్రంలో భాజపా (BJP)ను గద్దె దించేందుకు దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని బిహార్‌ (Bihar) ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న ఆయన.. అది విజయవంతమైతే భాజపాను 100 స్థానాలకే పరిమితం చేయొచ్చని తెలిపారు. పట్నాలో నిర్వహించిన సీపీఐ-ఎం 11వ సాధారణ సమావేశాలకు నితీశ్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌సహా వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీతీశ్‌ మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్‌ నేతలు వీలైనంత త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలి. నా సూచనలు సలహాలు పాటించి..ఉమ్మడిగా బరిలోకి దిగితే లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీని 100 సీట్లకే పరిమితం చేయొచ్చు. కాదు కూడదు అంటే.. ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు’’ అని నితీశ్‌ వ్యాఖ్యానించారు.

దేశ ప్రజలందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడం, విద్వేషాలను వ్యాప్తి చేసే వ్యక్తుల నుంచి దేశాన్ని విముక్తి చేయడమే తన ఏకైక ఆశయమని నీతీశ్‌ చెప్పారు. అంతకుమించి తాను కోరుకునేదేమీ లేదన్నారు. చివరి వరకు ప్రజల పక్షాన పోరాడతానన్నారు.ఈ కార్యక్రమానికి బిహార్‌ ఉపముఖ్యమంత్రి  తేజశ్వీ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ తదితరులు హాజరయ్యారు. భాజపాతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీశ్‌కుమార్‌.. భావసారూప్యత కలిగిన పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఢీ కొట్టేందుకు సమాయత్తమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని