Chandrababu: ప్రజలు గమనించారు.. జగన్‌ మళ్లీ గెలిచే పరిస్థితి లేదు: చంద్రబాబు

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ప్రజా విజయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 19 Mar 2023 14:36 IST

అమరావతి: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ప్రజా విజయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ప్రజా తీర్పును జగన్‌ సర్కార్‌పై తిరుగుబాటుగా చూడాలన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్లు రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారని.. చైతన్యం, బాధ్యతతో వచ్చి ఓట్లేశారన్నారు. నాలుగేళ్లలో జగన్‌ విధ్వంస పాలన కొనసాగించారని చంద్రబాబు విమర్శించారు. 

జగన్‌ సొంత నియోజకవర్గంలోనూ తిరుగుబాటు

‘‘జగన్‌ బాధ్యత లేని వ్యక్తి మోసాలు చేయడంలో దిట్ట. ఆయనది ధనబలం.. రౌడీయిజం.. అవి ఎప్పటికీ శాశ్వతం కాదు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. ఉగాది పంచాంగాన్ని ప్రజలు రెండు రోజుల ముందే చెప్పారు. జగన్‌ అక్రమాలను నమ్మి వాటితోనే ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడాలో అన్నీ చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు మాట్లాడితే కేసులు పెట్టించి వేధించారు. జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ తిరుగుబాటు ప్రారంభమైంది. నేరాల్లో అధికారులను భాగస్వామ్యం చేస్తున్నారు. వైకాపా పాలనలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొంది. సీఎస్‌ సహా అధికారులను కోర్టులు చీవాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. శాసనసభ, మండలిని ప్రహసనంగా మార్చారు. కోర్టులు, జడ్జిలను బ్లాక్‌ మెయిల్‌ చేసేవిధంగా ప్రవర్తించారు.

ఓటమిని అంగీకరించలేని పరిస్థితిలో వైకాపా

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఐదో తరగతి చదివిని వ్యక్తికీ ఓటు హక్కు కల్పించారు. ఓటుకు రూ.10వేలు, వెండి నగలు ఇచ్చి మభ్యపెట్టారు. తెదేపా ప్రచారం నిర్వహించకుండా అడ్డంకులు సృష్టించారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు నివారించడం పెద్ద సమస్యగా మారింది. కౌంటింగ్‌లో హాలులోనూ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎమ్మె్ల్సీ ఎన్నికలకు పులివెందుల నుంచి మనుషులను పంపారు. పోరాడి చివరకు తెదేపా అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించినా డిక్లరేషన్‌ ఇవ్వలేదు. రీకౌంటింగ్‌ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఓటమిని అంగీకరించలేని పరిస్థితి వైకాపాది. మీ పని అయిపోయింది..  ఇకపై మీ ఆటలు సాగవు’’ అని వైకాపాను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని