chandrababu: రాష్ట్రానికి సైకో పాలన వద్దు .. సైకిల్‌ పాలన ముద్దు: చంద్రబాబు

రాష్ట్రానికి సైకో పాలన వద్దు సైకిల్‌ పాలన ముద్దని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇవాళ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు.

Updated : 08 Dec 2022 18:14 IST

పొన్నూరు: రాష్ట్రానికి సైకో పాలన వద్దు సైకిల్‌ పాలన ముద్దని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇవాళ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. నారాకోడూరులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్‌కు నాలుగేళ్ల తర్వాత బీసీలు గుర్తుకు వచ్చి జయహో బీసీ సభ నిర్వహించారని ఎద్దేవా చేశారు. సభకు రాకపోతే సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామని బెదిరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి తనకు కొత్త కాదని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం, పిల్లల భవిష్యత్తు కోసం తాపత్రయపడుతున్నట్టు చెప్పారు. పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల నరేంద్రను నేరుగా ఎదుర్కోలేక సంగం డెయిరీపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. సంగం డెయిరీని కాదని గుజరాతీ కంపెనీ అమూల్‌ను ప్రోత్సహించడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు.

పెదకాకాని వద్ద చంద్రబాబుకు ఘన స్వాగతం

తెదేపా అధినేత చంద్రబాబుకు గుంటూరు జిల్లా పర్యటనలో ఘన స్వాగతం లభించింది. పెదకాకాని వద్ద పొన్నూరు నియోజకవర్గంలోకి ప్రవేశించగానే తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా బుడంపాడు చేరుకున్నారు. బుడంపాడు వద్ద చంద్రబాబును గజమాలతో ఘనంగా స్వాగతించారు. బుడంపాడు నుంచి బైక్‌ ర్యాలీతో చంద్రబాబు పర్యటన సాగింది. నారా కోడూరు సభకు తెదేపా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా భారీగా తరలివచ్చారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని