cm kcr: మోదీ సర్కారు వల్ల తెలంగాణకు రూ.3లక్షల కోట్ల నష్టం: సీఎం కేసీఆర్‌

మోదీ సర్కారు వల్ల వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే తెలంగాణ జీఎస్‌డీపీ ఇంకా పెరిగి ఉండే దన్నారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.  

Updated : 04 Dec 2022 18:21 IST

మహబూబ్‌నగర్‌: ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిద్దామని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో ముందుకెళ్తామన్నారు. ‘‘నేను మీతో ఉంటా.. మీరు నాతో ఉండాలి. మీరు హామీ ఇస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం. తెలంగాణ వలే భారత్‌ను కూడా అభివృద్ధి చేసుకుందాం. జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ చురుకైన పాత్ర పోషించాలి’’ అని కేసీఆర్‌ అన్నారు.

‘‘సమైక్య పాలకులు మనల్ని నిరాదరణకు గురి చేశారు. వలసలతో వలవలపించేను పాలమూరు అనే  పాట ఉండేది. కానీ, ఇప్పుడు పాలమూరు అంటే పచ్చబడ్డ జిల్లా అంటున్నారు. పోరాటాలు చేసిన సాధించుకున్న తెలంగాణలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నాం. మహబూబ్‌నగర్‌ జిల్లా ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుతోంది.  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్కటే పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించటం లేదు. సంక్షేమంలో మనకు ఎవరూ సాటి లేరు.. పోటీ లేరు. ప్రతి వర్గానికి ఒక కార్యక్రమం చేపట్టి ఆదుకుంటున్నాం. మహబూబ్‌నగర్‌కు క్రీడా మైదానం, ఆడిటోరియం మంజూరు చేస్తాం. తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా బాగుపడుతుందని 20 ఏళ్ల క్రితమే చెప్పాను. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజలు తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. గతంలో రూ.50వేలు ఇచ్చే ఆపద్బంధు కోసం కాళ్లు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు రైతు ఏ కారణంతో చనిపోయినా.. రైతు బీమా కింద రూ.5లక్షలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాకు వైద్య కళాశాలలు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నామా?రాత్రింబవళ్లు కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం ఇంత ప్రగతి సాధించింది. మేధావులు, చదువుకున్న యువత సరిగా ఆలోచించాలి. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పథకాన్ని త్వరలో ప్రారంభిస్తాం. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు రూ.3లక్షల చొప్పున మంజూరు చేస్తాం. నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు చొప్పున త్వరలోనే మంజూరు చేస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా?

మోదీ సర్కారు వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3లక్షల కోట్లు నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే తెలంగాణ జీఎస్‌డీపీ ఇంకా పెరిగి ఉండేది.  కృష్ణా జలాల్లో వాటా తేల్చేందుకు మోదీకి ఎనిమిదేళ్లు కూడా సరిపోలేదా? వాటా తేల్చేందుకు 8 ఏళ్లు సరిపోకపోతే అనుమతులు ఇచ్చేది ఎప్పుడు? ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టిస్తున్నారు. దేశంలో ఏం జరుగుతుందో గ్రామాల్లో చర్చ జరగాలి. ప్రజలు, మేధావులు, యువత ఆలోచించాలి. ఐదేళ్లలో మిషన్‌ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పా. ఆవిధంగానే చేసి చూపించాం. రాష్ట్రానికి భాజపా నేతలు ఏమీ చేయరు, చేసే వారి కాళ్లలో కట్టెలు పెడతారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు రాజకీయాల కోసం కాదు. తెలంగాణ రైతు దేశంలోనే గర్వంగా తలెత్తుకుని నిలబడాలని భావించాం. కేంద్రాన్ని ప్రశ్నిస్తే  కేసీఆర్‌ .. నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని ప్రధాని మోదీయే అన్నారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా? బంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారని మోదీ చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే ప్రజాస్వామ్య విధానమా? తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నలుగురు దొంగలు వస్తే..  వారిని పట్టుకుని జైల్లో పెట్టాం’’ అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు