CM Kcr: కాంగ్రెస్‌ రాజ్యంలో దళారులదే భోజ్యం: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరుకు ప్రత్యేక స్థానం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Updated : 06 Jun 2023 22:10 IST

నాగర్‌ కర్నూల్‌: తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరుకు ప్రత్యేక స్థానం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నాగర్‌ కర్నూల్‌లో నూతనంగా నిర్మించిన భారాస జిల్లా కార్యాలయం, కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. పాలమూరు ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. ఇది మహబూబ్‌నగర్‌ జిల్లా కీర్తికిరీటంలో శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు. ‘‘ఉద్యమ సమయంలో పాలమూరు నుంచి ఎంపీగా పోటీపై ప్రొఫెసర్‌ జయశంకర్‌తో చర్చించా. తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారని చెప్పారు. అప్పట్లో పాలమూరులో ఉద్యమం బలంగా లేకపోయినా నన్ను గెలిపించారు. తెలంగాణ రాకపోయి ఉంటే నాగర్‌ కర్నూల్‌ జిల్లా కాకపోయేది.. ఈ ఆఫీసులు వచ్చేవి కావు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీసు ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.

కొత్త వేషాలతో మళ్లీ మోసగాళ్లు బయలుదేరారు. ఇదే జిల్లా నుంచి వచ్చిన ఒకాయన ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తే రైతులను బంగాళాఖాతంలో వేసినట్టే. ధరణి రాక ముందు అంతా లంచాల మయంగా ఉండేది. ధరణి వల్ల ఒకశాతం సమస్యలు ఉంటే ఉండవచ్చు. ధరణి పోర్టల్‌లో మార్పులు చేసే అధికారం సీఎంనైన నాకు కూడా లేదు. ధరణితో రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న అధికారాన్ని ప్రజలకు ఇచ్చాం. ధరణి లేకపోతే ఎన్ని గొడవలు, హత్యలు జరిగేవో ఆలోచించండి. ధరణి ఉండాలా? వద్దా? అనేది మీరే చెప్పండి. మళ్లీ రైతులను పోలీస్‌స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పేలా కాంగ్రెస్‌ కుట్ర చేస్తోంది. నమ్మి అధికారమిస్తే పంటికి అంటకుండా మింగేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌ రాజ్యంలో దళారులదే భోజ్యం. పైరవీ కారులదే భోజ్యం. మళ్లీ మనల్ని మింగేయడానికి చెబుతున్నారు. వారి మాటలు నమ్మొద్దు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇవాళ ఉన్న భారాస ప్రభుత్వానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది.

మన కళ్లు మన వేలుతోనే పొడిపించే దుర్మార్గం చేయడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. భారాస ప్రభుత్వమంటేనే రైతు రాజ్యం. మహారాష్ట్రకు వెళితే తెలంగాణ లాంటి మోడల్‌ కావాలని అడుగుతున్నారు. కాంగ్రెస్‌ దుర్మార్గులు మళ్లీ మమ్మల్ని గెలిపిస్తే  వీఆర్‌ఓలను పెడతాం, మళ్లీ మీ నెత్తురు తాగుతాం, దోచుకుంటామని సిద్ధంగా ఉన్నారు. మోసపోతే గోసపడతాం.. జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఏది తలపెట్టినా భగవంతుడు నన్ను ఓడించలేదు.. గెలిపించాడు. తెలంగాణ వస్తే అంధకారమవుతుందని అప్పట్లో అంధ్రానేతలు శాపాలు పెట్టారు. ఇప్పడేమైంది.. తెలంగాణ ధగధగ వెలిగిపోతోంది. ఆంధ్రాలో చీకట్లు కమ్ముకున్నాయి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని