CM Kcr: దుష్ట శక్తులకు బుద్ధి చెప్పాలి: వికారాబాద్‌ సభలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం వికారాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా వికారాబాద్‌లో రూ.61 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని...

Updated : 16 Aug 2022 19:58 IST

వికారాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం వికారాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా వికారాబాద్‌లో రూ.61 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు వికారాబాద్‌లో నూతనంగా నిర్మించిన తెరాస జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు.

ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చా..

‘‘ఉద్యమ సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు వికారాబాద్‌లో పెట్టాలని కోరేవారు. రాష్ట్రం సిద్ధిస్తే వికారాబాద్‌నే జిల్లా చేసుకుందామని చెప్పా. ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్‌ను జిల్లా చేసుకుని మంచి భవనాలు నిర్మించుకున్నాం. వికారాబాద్‌కు మెడికల్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీ మంజూరైంది. తెలంగాణ రాకముందే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం రాకుంటే వికారాబాద్‌ జిల్లా అయ్యేదా? వైద్య కళాశాల వచ్చేదా? తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని దుష్ప్రచారం చేశారు. కానీ, ఏపీ, కర్ణాటకలో కంటే తెలంగాణలోనే భూముల ధరలు ఎక్కువ. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఇతర రాష్ట్రాల్లో 3 ఎకరాలు కొనుగోలు చేస్తున్నారు. రాయచూర్‌ ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి లేదా అక్కడి పథకాలు ఇక్కడ కూడా అమలు చేయాలని స్థానిక ఎమ్మెల్యేను నిలదీసే పరిస్థితి వచ్చింది. గతంలో రైతులు చనిపోతే ఆపద్భందు పథకం కింద రూ.50వేలు ఇచ్చే వారు. కానీ, ఇప్పుడు గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా పది రోజుల్లోపే రూ.5లక్షల రైతు బీమా సొమ్ము అందిస్తున్నాం. గతంలో రైతులు భూములు అమ్ముకుని హైదరాబాద్‌లో కూలీలుగా పనిచేసేవారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు లేకుండా చేశాం. గృహ, వ్యాపార, వాణిజ్య పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్‌ అందిస్తున్నాం. మిషన్‌ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు అందించాం. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బంధు ద్వారా వ్యవసాయం సస్యశ్యామలంగా మారింది. తెచ్చిన తెలంగాణను యువత, రైతులు, మేధావులు కాపాడుకోవాలి.

మోసపోతే  గోసపడతాం..

భాజపా ఎనిమిదేళ్లలో ఏం ఉద్ధరించింది. మోసపోతే గోసపడతాం. సమైక్య పాలనలో చిక్కి మనం విలవిల్లాడాం. పెరుగన్నం తినే రైతు పురుగుల మందు తాగిండు. మళ్లీ ఆ పరిస్థితి తేవద్దు. ఉచిత పథకాలు రద్దు చేయాలంటున్నారు. రైతుల మెడమీద కత్తి పెట్టి బిల్లులు వసూలు చేయాలని చెబుతున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారు.. పెడదామా? భాజపా జెండాను చూసి మోసపోతే ఉచిత కరెంటు ఉండదు. బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి వస్తుంది. మోదీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోగా ఉచిత పథకాలు వద్దని చెబుతోంది. కేంద్రంలో భాజపా పాలనపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. మోదీ.. ఈ దేశానికి ఏం చేశారో చెప్పండి. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వొద్దంట.. పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ.20లక్షల కోట్లు దోచిపెడతారట. భాజపా మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతోంది. గతంలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంత? ఇప్పుడు ఎంత? తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోంది. రాష్ట్రం బాగుపడితే సరిపోదు.. దేశం బాగుపడాలి. పాలమూరు - రంగారెడ్డి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. కృష్ణానదిలో తెలంగాణ నీటి వాటా తేల్చమంటే కేంద్రంలోని భాజపా తేల్చడంలేదు. ఇక్కడి భాజపా నాయకులకు దమ్ముంటే దిల్లీ వెళ్లి పాలమూరు-రంగారెడ్డి ఆగిపోయింది,  కృష్ణాలో నీటివాటా సంగతి తేల్చాలని అడగాలి. ఆ దమ్ము వారికి లేదు.. మోదీని చూస్తే వారికి భయం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు- రంగారెడ్డి నిర్మించి తీరుతాం. రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉంటే ఆశించిన ప్రగతి సాధ్యమవుతుంది. దుర్మార్గులను తరిమికొట్టి అద్భుతమైన భారత దేశాన్ని నిర్మించుకోవాలి. అందుకు మనమంతా సంసిద్ధులై దుష్టశక్తులకు బుద్ధి చెప్పాలి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని