Congress President Poll: పోటీ చేయట్లేదు.. ఖర్గేకే నా మద్దతు: దిగ్విజయ్‌ సింగ్‌

కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఖర్గే వైపే మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో.. అధ్యక్ష పదవికి పోటీ చేయట్లేదని ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ ప్రకటించారు.

Updated : 30 Sep 2022 13:04 IST

దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. అధ్యక్ష పదవి కోసం చివరి నిమిషంలో సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే బరిలోకి వచ్చారు. దీంతో ఆయనకు మద్దతుగా ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ పోటీ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని డిగ్గీరాజా స్వయంగా వెల్లడించారు.

అధ్యక్ష పదవికి ఖర్గే పోటీ చేయనున్నారనే వార్తలు వెలువడగానే.. శుక్రవారం ఉదయం దిగ్విజయ్‌ ఆయన నివాసానికి వెళ్లారు. ఖర్గేతో కొంతసేపు భేటీ అయిన తర్వాత మరో సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం అధ్యక్ష పదవికి పోటీ చేయట్లేదని దిగ్విజయ్‌ నుంచి ప్రకటన వెలువడింది. ‘‘ఖర్గే మా నాయకుడు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆయనకు మద్దతిస్తున్నా’’ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పార్టీ హైకమాండ్‌ కూడా ఖర్గే వైపే మొగ్గుచూపిస్తున్న నేపథ్యంలో దిగ్విజయ్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం ఖర్గే నామినేషన్‌..

గాంధీ కుటుంబంతో పాటు పార్టీలో అధిక మంది ఖర్గేకు మద్దతుగా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఖర్గే ఈ మధ్యాహ్నం నామినేషన్‌ వేయనున్నట్లు ఆ పార్టీ నేత ప్రమోద్‌ తివారీ తెలిపారు. ఆయనకు తాను ప్రతిపాదకుడిగా ఉండనున్నట్లు చెప్పారు. నామినేషన్‌కు ముందు ఖర్గే.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నట్లు సమాచారం.

పోటీలోనే ఉంటా: శశిథరూర్‌

ఇదిలా ఉండగా.. అధ్యక్ష పదవి రేసు నుంచి ఎంపీ శశిథరూర్ కూడా వైదొలిగే అవకాశమున్నట్లు వార్తలు వినిపించాయి. ఖర్గేను ఏకగ్రీవం చేసేందుకు థరూర్‌ నామినేషన్‌ వేయకపోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వీటిని ఆయన ఖండించారు. తాను పోటీలోనే ఉంటానని థరూర్‌ మరోసారి స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తానని ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతానికి శశిథరూర్‌, ఖర్గే మధ్య పోటీ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని