Congress: మహిళలకు ఏడాదికి రూ.లక్ష.. ఉద్యోగాల్లో 50% కోటా: కాంగ్రెస్‌ హామీ

Congress: కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈమేరకు ‘నారీ న్యాయ్‌’ గ్యారెంటీని ప్రకటించింది.

Published : 13 Mar 2024 14:42 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Loksabha Elections 2024) దగ్గరపడుతున్న వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ (Congress) పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా మహిళలకు ప్రత్యేకంగా ఐదు గ్యారెంటీలను ప్రకటించింది. పేద కుటుంబాల్లోని మహిళలకు ఏటా రూ.లక్ష నగదును బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా చేపట్టే నియామకాల్లో నారీమణులకు 50శాతం కోటా ఇవ్వనున్నట్లు తెలిపింది.

‘నారీ న్యాయ్‌ (Nari Nyay)’ పేరుతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఈ హామీని ప్రకటించారు. అటు మహారాష్ట్రలో ‘భారత్‌ జోడో న్యాయ్‌యాత్ర’లో ఉన్న రాహుల్‌ గాంధీ కూడా  ఈ గ్యారెంటీకి సంబంధించిన వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇందులో మొత్తం ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్‌ ప్రకటించింది.

మహిళల కోసం కాంగ్రెస్‌ హామీలివే..

  • మహాలక్ష్మి: ఈ పథకం కింద ప్రతీ పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష నగదును నేరుగా వారి ఖాతాలోకి బదిలీ
  • ఆదీ ఆబాదీ-పూరా హక్‌: కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌
  • శక్తి కా సమ్మాన్‌: ఆశా, అంగన్వాడీలు, మధ్యాహ్నభోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటా రెట్టింపు
  • అధికార్‌ మైత్రీ : న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి, వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతీ పంచాయతీలో ఒక అధికార్‌ మైత్రీ నియామకం
  • సావిత్రీబాయి పూలే హాస్టళ్లు: ఉద్యోగం చేసే మహిళల కోసం హాస్టళ్లు రెట్టింపు.. ప్రతీ జిల్లాలో కనీసం ఓ హాస్టల్‌ ఏర్పాటు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని