Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే.. 150 స్థానాలు గెలుస్తామన్న రాహుల్ గాంధీ!
కర్ణాటక ఫలితాలే మధ్యప్రదేశ్‌లోనూ పునరావృతం అవుతాయని కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్ నేతలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
దిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో 150 స్థానాల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్ర నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పి. అగర్వాల్ సహా ఆ రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కర్ణాటకలో పార్టీ గెలుపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని రాహుల్ గాంధీ చెప్పినట్లు నేతలు తెలిపారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
‘‘మా మధ్య చాలా సమయం చర్చ జరిగింది. కర్ణాటకలో మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని ముందే అంచనా వేశాం. మధ్యప్రదేశ్‌లో కూడా 150 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తాం. కర్ణాటక ఫలితాలే మధ్యప్రదేశ్‌లో కూడా పునరావృతం కానున్నాయి’’ అని సమావేశం అనంతరం రాహుల్ గాంధీ చెప్పారు. ఈ ఎన్నికల్లో నేతలంతా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని తీర్మానించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలోని సమస్యలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు కమల్‌నాథ్ తెలిపారు.
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే.. 100 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇవ్వడంతోపాటు మరో 100 యూనిట్ల కరెంట్ సగం ధరకే ఇస్తామని కమల్‌నాథ్ ప్రకటించారు. దాంతోపాటు మహిళలకూ ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కమల్‌నాథ్.. ఏడాదిపాటు ఆ పదవిలో కొనసాగారు. అయితే, 2020లో జ్యోతిరాదిత్య సింధియాతోపాటు 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి భాజపాలో చేరారు. అనంతరం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భాజపా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
రాయితీపై శనగపప్పు.. ‘భారత్ దాల్’ కిలో రూ.60కే..
-
Art of Living: ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
-
Congress: కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్!
-
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వాన
-
Weather Update: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
-
‘ప్రతిపక్ష అభ్యర్థులను పశువుల్లా కొన్నాం’