Andhra News: మోదీ ఆదేశాలతో కేటీఆర్‌ మాట మార్చారేమో..: సీపీఐ నారాయణ

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఏపీపై చేసిన వ్యాఖ్యలను రాత్రికిరాత్రే మార్చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Updated : 01 May 2022 13:51 IST

రాజమహేంద్రవరం: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఏపీపై చేసిన వ్యాఖ్యలను రాత్రికిరాత్రే మార్చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఆదేశాలతో కేటీఆర్‌ మాట మార్చేశారేమో అని ఆరోపించారు. రహదారుల పరిస్థితిని నగరిలో తాను ప్రత్యక్షంగా చూపించినట్లు వివరించారు. నా వీడియో చూసి రోడ్లు బాగుచేయాలని మంత్రి రోజా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు నారాయణ తెలిపారు.

మేడే సందర్భంగా రాజమహేంద్రవరంలో పర్యటించిన నారాయణ మీడియాతో మాట్లాడారు. సమస్య గురించి చెబితే సరిదిద్దుకునే విధానం ఉండాలని చెప్పారు. నిన్న దిల్లీలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ విలువైన సూచనలు చేసినట్లు నారాయణ వివరించారు. న్యాయవ్యవస్థలో ముందుగా దేశద్రోహం చట్టం రద్దు చేయాలని కోరారు. కోర్టు ధిక్కరణ కేసులు ప్రభుత్వం నుంచే ఎక్కువ అని నారాయణ అన్నారు. కోర్టు ధిక్కరణ సీఎంలలో జగన్‌ నెంబర్‌ వన్‌ అని.. తెలంగాణ నుంచి సీఎస్‌ నెంబర్‌వన్‌ అని ఆయన ఆరోపించారు.

పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని కేటీఆర్‌ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుట్టించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై పోటాపోటీగా విమర్శలు గుప్పించుకున్నారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదని, జగన్‌ పాలనలో ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని కేటీఆర్‌ మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ఏపీపై చేసిన వ్యాఖ్యలను తాను ఏకీభవిస్తున్నట్లు నారాయణ నిన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ, తమిళనాడులో రోడ్ల పరిస్థితిని వీడియోల ద్వారా వివరించిన విషయం తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని కేటీఆర్‌ ట్వీట్‌ చేసిన నేపథ్యంలో తాజాగా దీనిపై కూడా నారాయణ స్పందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని