TS News: ఆ ఐదు అంశాలపైనే నా పోరాటం: ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత ఈటల రాజేందర్‌ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. భారీ మెజార్టీతో గెలిపించిన హుజూరాబాద్‌

Updated : 02 Nov 2021 21:29 IST

కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత ఈటల రాజేందర్‌ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. భారీ మెజార్టీతో గెలిపించిన హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఎన్ని అక్రమాలు జరిగినా మీడియాలో స్వేచ్ఛగా ప్రజలకు చూపించలేకపోయారు. కేసీఆర్‌ ప్రజా స్వామ్యాన్ని  నమ్ముకోలేదు. డబ్బు సంచులు, అక్రమాలు, అన్యాయాన్ని నమ్ముకున్నారు. అమెరికాలో ఉన్నా, లండన్‌లో ఉన్నా, సూరత్‌లో ఉన్నా ఉప ఎన్నిక కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. కేసీఆర్‌ అహంకారం పోవాలని కోరుకున్నారు. ఉప ఎన్నికలో చివరికి  కుల ఆయుధం కూడా ఉపయోగించారు. రకరకాల పథకాలతో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఇష్టారీతిన డబ్బులు ఖర్చు చేశారు. శ్మశానంలో డబ్బులు పంచుతున్నా అధికారులు పట్టించుకోలేదు. పోలీసులు దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించారు. స్వేచ్ఛను హరించే సంస్కృతి మంచిది కాదు. కేసీఆర్‌ చెంప చెళ్లుమనిపించే తీర్పు హుజూరాబాద్‌ గడ్డ ఇచ్చింది. మీ నోట్లో నాలుకలాగా ఉంటా. పార్టీలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా. ఉద్యమ బిడ్డగానే ఎప్పటికీ కొనసాగుతా. రేపటి నుంచి ఐదు అంశాలపై నా పోరాటం కొనసాగుతోంది. దళిత బంధును తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా. మిగిలిన కులాలకు కూడా దళితబంధు మాదిరిగా ఆర్థిక సాయం చేయాలి. డబుల్‌ బెడ్‌ ఇళ్ల హామీని నెరవేర్చాలి. స్థలాలు ఉన్నవారు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు ఇవ్వాలి. తెలంగాణ నినాదం.. నీళ్లు, నిధులు, నియామకాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి ప్రకటించిన విధంగా నెలకు రూ.3,016 లు ఇవ్వాలి, 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి, రైతాంగం పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి’’ అని ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. కష్టాలను ఓర్చుకుని భాజపా విజయం కోసం పనిచేసిన  కార్యకర్తలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని