BJP: 24 గంటల ఫ్రీ కరెంట్‌.. నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా: ఈటల రాజేందర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్‌ విసిరారు.

Updated : 02 Feb 2023 19:04 IST

హైదరాబాద్‌: దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని హుజూరాబాద్  భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను మొత్తం అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ..శాఖలపై ఒక్కసారైనా సమీక్ష చేశారో లేదో ఆయా శాఖల మంత్రులు గ్రహించాలన్నారు. తెలంగాణలో ఎక్కడైనా 24 గంటలు కరెంట్ ఇస్తే  నిరూపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉచితంగా 24గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతాలు, జీపీఎఫ్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. 

2014లో ఎన్ని ఆస్తులు, 2023లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో చర్చకు సిద్ధమా అని సీఎంకు ఈటల సవాల్ విసిరారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది తాను కాదని.. కేసీఆరేనని అన్నారు. తాను పార్టీకి రాజీనామా చేసి పోలేదని.. కేసీఆరే పార్టీ నుంచి వెళ్లగొట్టారనే విషయం రాష్ట్ర ప్రజల అందరికీ తెలుసన్నారు. టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్‌కే కేసీఆర్ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల గౌరవానికి భంగం కలిగిస్తే శిలాఫలకాలు పగలకొడతామని ఈటల హెచ్చరించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం..

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.  అక్రమ కేసులు, నిరుద్యోగ యువత, రైతుల సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావిస్తామని చెప్పారు. భారాస సర్కారు ప్రజా విశ్వాసం కోల్పోయిందని, కేసీఆర్ అవినీతి, అక్రమ పాలనలో యువత, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో మిగతా ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలతో కలిసే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఈటల చెప్పారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు