Shiv sena: ఏక్‌నాథ్‌ శిందే చేతికి ‘రెండు కత్తులు, డాలు’

మహారాష్ట్రలో శివసేన పార్టీకి చెందిన ఏక్‌నాథ్‌ శిందే(Eknath shindhe) వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గుర్తును కేటాయించింది. ముఖ్యమంత్రి వర్గం అభ్యర్థన మేరకు రెండు కత్తులు, డాలు(two swords, shield) ఉన్న గుర్తును ఖరారు చేసింది.

Published : 12 Oct 2022 01:08 IST

దిల్లీ: మహారాష్ట్రలో శివసేన పార్టీకి చెందిన ఏక్‌నాథ్‌ శిందే(Eknath shindhe) వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గుర్తు కేటాయించింది. ముఖ్యమంత్రి వర్గం అభ్యర్థన మేరకు రెండు కత్తులు, డాలు(two swords, shield) ఉన్న గుర్తును ఖరారు చేసింది. ఇప్పటికే శిందే వర్గానికి ‘బాలాసాహెబంచి శివసేన’ పేరును కేటాయించిన ఈసీ.. అంధేరి (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో గుర్తును కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే, శిందే వర్గం కోరిన డాలు, తల్వార్‌ గుర్తు ఉచిత చిహ్నాల జాబితాలో లేదని ఎన్నికల సంఘం ప్రకటనలో పేర్కొంది. అయితే, 2004లో రాష్ట్ర పార్టీగా గుర్తింపును కోల్పోయిన 'పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్' పార్టీ గుర్తు రెండు కత్తులు, డాలు ఉచిత గుర్తుల జాబితాలో ఉందని.. ఇది శిందే వర్గం కోరిన గుర్తును పోలి ఉండటంతో దాన్నే ఆ వర్గానికి కేటాయించినట్టు పేర్కొంది. శివసేన వివాదంలో తుది ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు శిందే వర్గానికి ఈ గుర్తే ఉంటుందని పేర్కొంది. 

శివసేన పార్టీ పేరు, విల్లంబుల గుర్తు కోసం గత కొంతకాలంగా ఠాక్రే, శిందే వర్గాల మధ్య తీవ్ర పోరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంధేరీ తూర్పు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెలలో ఉప ఎన్నిక జరగనున్న దృష్ట్యా శివసేన పేరు, ఎన్నికల గుర్తును స్తంభింపజేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా కొత్త పేరు, గుర్తు కోసం మూడేసి ఐచ్ఛికాలను తమకు సమర్పిస్తే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దీంతో తమకు త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని ఠాక్రే వర్గం కోరింది. శిందే వర్గం కూడా త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడుతోపాటు గద గుర్తులను సమర్పించింది. కాగడా గుర్తును ఠాక్రే వర్గానికి కేటాయించిన ఈసీ.. శిందే వర్గం ప్రతిపాదించిన త్రిశూలం, గద మతపరమైన చిహ్నాలను ప్రతిబింబిస్తున్న నేపథ్యంలో వాటిని కేటాయించడానికి నిరాకరించింది. ఉదయిస్తున్న సూర్యుడు గుర్తు ఇప్పటికే డీఎంకేకు ఉన్నందున దాన్ని కూడా తిరస్కరించింది. ఎన్నికల గుర్తు కోసం శిందే వర్గం మరో మూడు తాజా ఐచ్ఛికాలను ఈరోజు ఉదయం 10 గంటల లోపు సమర్పించాలని సోమవారం సూచించగా వారు సమర్పించిన గుర్తును పోలి ఉన్న రెండు కత్తులు, డాలు గుర్తును కేటాయిస్తూ మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని