‘రాజధాని కావాలని విశాఖ ప్రజలు అడిగారా?’

రాజధాని తరలింపు ఆందోళనతో పది మంది మృతి చెందడం ఎంతో కలిచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల్లో నెలకొన్న విషాదానికి వైకాపా ప్రభుత్వమే కారణమని...

Updated : 08 Jan 2020 21:38 IST

తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి: రాజధాని తరలింపు ఆందోళనతో పది మంది మృతి చెందడం ఎంతో కలిచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల్లో నెలకొన్న విషాదానికి వైకాపా ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. విజయవాడలోని వేదిక కల్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఐకాస సమావేశంలో ఆయన మాట్లాడారు. బయటకు వస్తే కేసులు పెడతారని ప్రజలు భయపడుతున్నారన్నారు. ఎందుకు తమపై దౌర్జన్యం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. రాజధాని కావాలని విశాఖ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా? అని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హుద్‌హుద్‌ వచ్చినపుడు విశాఖ ప్రజలు పూర్తిగా సహకరించారని చంద్రబాబు గుర్తు చేశారు. రాజధాని కోసం ఎన్ని కమిటీలు వేస్తారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

అంతకుముందు ఆయన ట్విటర్‌లో ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గతంలో ఇసుక మాఫియా ఆగడాలతో 60 మంది భవన నిర్మాణ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. వైకాపా 200 రోజుల పాలనలో 280 మంది రైతుల ఆత్మహత్యలు, ఇప్పుడు రాజధాని మార్పుపై ఆందోళనతో మరో 10 మంది మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నీ వైకాపా సృష్టించినవేనన్నారు. ఉన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త ఇబ్బందులు సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అసమర్థ పాలనతో రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేశారని ఆయన దుయ్యబట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని