మోదీకి ఆ ధైర్యం లేదు: రాహుల్‌

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేరళలోని వయోనాడ్‌ జిల్లా కాల్పెట్టలో గురువారం సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా నాథూరాం గాడ్సే, మోదీలను..........

Updated : 30 Jan 2020 16:00 IST

వయనాడ్‌: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేరళలోని వయనాడ్‌ జిల్లా కాల్పెట్టలో గురువారం సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా నాథూరాం గాడ్సే, మోదీలను సరిపోలుస్తూ వ్యాఖ్యలు చేశారు.  జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే సిద్ధాంతం, ప్రధాని నరేంద్ర మోదీ విశ్వసించిన సిద్ధాంతం ఒక్కటేనన్నారు. గాడ్సేను విశ్వసిస్తున్నానని చెప్పే ధైర్యం ప్రధానికి లేదు తప్ప వారిద్దరు విశ్వసించిన సిద్ధాంతంలో మాత్రం తేడా లేదని ఆరోపించారు.  దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్న రాహుల్.. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వాటి వల్ల కొత్తగా ఉద్యోగాలు రావన్నారు. భారతదేశ పౌరులు తాము భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నారంటూ ధ్వజమెత్తారు.  మహాత్మా గాంధీ సత్యాన్వేషణ చేస్తున్నందు వల్లే ఆయన పట్ల ద్వేషంతో గాడ్సే కాల్చి చంపాడని రాహుల్‌ అన్నారు. 

‘‘భారతదేశ పౌరులు భారతీయులమని నిరూపించుకోవాలంటున్నారు.. ఎవరు భారతీయులో నిర్ణయించడానికి మోదీ ఎవరు? నా భారతీయతను నిర్ణయించే లైసెన్స్‌ ఆయనకు ఎవరిచ్చారు? నేను భారతీయుడినని నాకు తెలుసు.. దాన్ని ఎవరి వద్దా నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలాగే, దేశంలోని 1.4 బిలియన్ల మంది ప్రజలు కూడా తాము భారతీయులమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

అంతకముందు వయనాడ్‌ జిల్లా కాల్పెట్టలో సీఏఏకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలు పట్టుకొని వందలాది మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేరళ ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితల, కేపీసీసీ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని