జగన్‌కు సభాహక్కుల నోటీసులిస్తాం:తెదేపా

సీఎం జగన్‌పై వచ్చే శాసన మండలి సమావేశాల్లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని తెదేపా ఎమ్మెల్సీలు తెలిపారు. మండలిని కించపరిచేలా...

Updated : 13 Feb 2020 17:23 IST

అమరావతి: సీఎం జగన్‌పై వచ్చే శాసన మండలి సమావేశాల్లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని తెదేపా ఎమ్మెల్సీలు తెలిపారు. మండలిని కించపరిచేలా సీఎం వ్యవహరించారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, రామకృష్ణ, బీటీ నాయుడు మీడియాతో మాట్లాడారు. అడ్డదారిన ఎమ్మెల్సీలుగా వచ్చారన్న సీఎం వ్యాఖ్యలపై సభాహక్కుల నోటీసులు ఇస్తామని వారు వివరించారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు ఉన్న మండలిపై సీఎం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని దుయ్యబట్టారు. త్వరలో తమ పార్టీ ఎమ్మెల్సీలమంతా దిల్లీ వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. కలిసొచ్చే ఇతర పార్టీల ఎమ్మెల్సీను తీసుకెళ్లి కేంద్రానికి సమస్యను నివేదిస్తామని తెలిపారు. మండలి రద్దు వెనుక రాజకీయ కారణాలను దిల్లీ పెద్దలకు వివరిస్తామన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులను కలుస్తామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు.

ఆంగ్ల మాద్యమంతో విద్యార్థులపై ఒత్తిడి: రామకృష్ణ

విద్య ముసుగులో వైకాపా ఓట్ల రాజకీయాలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ రామకృష్ణ విమర్శించారు. ఆంగ్ల మాద్యమంలో బోధనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని.. దీని వల్ల విద్యార్థులు కనిపించని ఒత్తిడికి లోనవుతారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆంగ్ల బోధనపై గగ్గోలు పెట్టిన అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. 1 నుంచి 8వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే బోధన జరగాలని కేంద్ర చట్టం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆంగ్ల మాద్యమం వల్ల డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని