సింధియా రేపు భాజపాలో చేరే అవకాశం?

ఉత్కంఠ పరిణామల మధ్య కాంగ్రెస్‌ను వీడిన సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో రేపు చేరనున్నట్టు తెలుస్తోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన........

Updated : 10 Mar 2020 20:48 IST

దిల్లీ: ఉత్కంఠ పరిణామల మధ్య కాంగ్రెస్‌ను వీడిన సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో రేపు చేరనున్నట్టు తెలుస్తోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. 18 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన సింధియా ఆ పార్టీకి రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభానికి తెరలేచింది. సింధియాకు భాజపా రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

ఈ ఉదయం దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సింధియా భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం వారిద్దరూ కలిసి ప్రధాని నరేంద్ర మోదీతోనూ సమావేశమై చర్చించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై బహిష్కరణ వేటు వేస్తూ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌కు సింధియా విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం ముగిసేలోపే సింధియా భాజపాలో చేరతారని జోరుగా ఊహాగానాలు వచ్చాయి. రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమిత్‌ షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, తావర్‌ సింగ్‌ గహ్లోత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు, మధ్యప్రదేశ్‌ ప్రతిపక్ష నేత గోపాల్‌ భార్గవ, భాజపా నేత నరోత్తమ్‌ మిశ్రా సహా పలువురు నేతలు సభాపతి ఎన్‌పీ ప్రజాపతి నివాసానికి వెళ్లారు. 19మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను ఆయనకు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని