
రాజ్‌నాథ్ నివాసంలో కేంద్రమంత్రుల కమిటీ భేటీ
దిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రధాని మోదీ నియమించిన కేంద్ర మంత్రుల కమిటీ ఇవాళ భేటీ అయ్యింది. కేంద్ర మంత్రి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో సమావేశమైన ఈ బృందం.. లాక్‌డౌన్ పొడిగింపు, ఏప్రిల్ 20 నుంచి దేశంలోని నాన్ హాట్‌స్పాట్ జోన్లలో పాక్షికంగా అనుమతించే ఆర్థిక కార్యకలాపాలపై చర్చించినట్లు సమాచారం. మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల అమలు, కొవిడ్ కేసులు నమోదు కాని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను అనుమతించే విషయాలపై పలు మంత్రిత్వ శాఖల నుంచి మంత్రుల బృందం ఇప్పటికే సమాచారం తీసుకుంది.
వైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని మంత్రుల బృందం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
పదవీ విరమణ చేసిన వైద్యులు, వైద్య నిపుణులు, వైద్య విద్య గ్యాడ్యుయేషన్ చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థుల సేవలు ఉపయోగించుకునే విషయంలో వచ్చిన పలు సూచనలపై మంత్రుల బృందం చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, గజేంద్ర సింగ్ షేకావత్, పీయూష్ గోయల్, రాంవిలాస్ పాసవాన్, స్మృతీ ఇరానీ, ప్రకాష్ జావడేకర్, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, రమేష్ పోఖ్రియాల్ హాజరయ్యారు.
సంప్రదింపుల బృందాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్
మరోవైపు ప్రస్తుత విషమ పరిస్థితుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంప్రదింపుల బృందాన్ని నియమించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 11 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ
బృందంలో పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, చిదంబరం, మనీష్ తివారి, జైరాం రమేష్, ప్రవీణ్ చక్రవర్తి, గౌరవ్ వల్లభ్, సుప్రియ శ్రీనాటే, రోహన్ గుప్తాలు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చించి పార్టీకి సూచనలు చేయనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.