‘ఇద్దరు సీఎంలదీ ప్రజల పొట్టకొట్టే ప్రయత్నం’ 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వంద్వ విధానాలను అవలంబిస్తూ తెలంగాణ ప్రజల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌

Published : 14 May 2020 01:16 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపణలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వంద్వ విధానాలను అవలంబిస్తూ తెలంగాణ ప్రజల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ బండి సంజయ్‌ బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఈ దీక్ష కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటి వరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది’’ అన్నారు.

‘‘నిన్న ఏపీకి చెందిన ఓ మంత్రి.. కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ అన్నదమ్ములు అని చెప్పారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి రెండు తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా దోచుకుంటున్నారో.. ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారో దీని ద్వారా స్పష్టమవుతోంది. ఇద్దరు సీఎంల మధ్య రాజకీయ పరంగా, ఆర్థిక లావాదేవీల పరంగా రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని తెలంగాణలోని నాలుగు జిల్లాలు రంగారెడ్డి, నల్గొండ, పాలమూరు, ఖమ్మం ప్రజల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుపై అందరూ ఆందోళనలు చేస్తామని హెచ్చరించే వరకు కేసీఆర్‌ స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.. లేదంటే ప్రజలు తిరగబడతారు’ అని హెచ్చరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని