యోగీ.. యూపీ  మీ ప్రైవేటు ప్రాపర్టీ కాదు!

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కార్మికుల్ని రప్పించుకోవాలనుకొనే రాష్ట్రాలు ఇక నుంచి తమ ప్రభుత్వాన్ని సంప్రదించాలంటూ యూపీ సీఎం యోగి .....

Published : 27 May 2020 00:38 IST

కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ విమర్శలు

బెంగళూరు: తమ కార్మికుల్ని రప్పించుకోవాలనుకొనే రాష్ట్రాలు ఇక నుంచి ప్రభుత్వాన్ని సంప్రదించాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. కార్మికుల విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం  రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇంగిత జ్ఞానం లేకుండా తీసుకొనే ఇలాంటి చర్యలతో రాష్ట్ర ప్రజలు ఎంతో బాధపడతారంటూ డీకే శివకుమార్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కార్మికులు ఒక చోట నుంచి ఇంకోచోటకు వెళ్లడంపై ఆంక్షలు  విధించడం వారి స్వేచ్ఛను హరించడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రైవేటు ప్రాపర్టీ ఏమీ కాదని యోగి గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో ఎక్కడైనా పనిచేయాలంటే యూపీ ప్రజలకు మీ ప్రభుత్వ అనుమతి అవసరం లేదని వ్యాఖ్యానించారు. 

తమ కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో చాలా రాష్ట్రాలు తమ కార్మికులను సరిగా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. తమ కార్మికులను రప్పించుకోవాలనుకునే రాష్ట్రాలు.. ఇక నుంచి ముందుగా తమ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుందని చెప్పారు. వారికి తమ రాష్ట్రంలోనే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులు తమ రాష్ట్రానికి పెద్ద వనరులు అనీ.. వారికి యూపీలోనే ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని