ఆరోగ్య బీమా మరింత భారం

పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది.

Updated : 05 May 2024 04:33 IST

10-15% పెరగనున్న ప్రీమియం
ఈనాడు - హైదరాబాద్‌

పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పుల నేపథ్యంలో బీమా సంస్థలు ప్రీమియాన్ని మరింత పెంచాలనే యోచనలో ఉన్నాయి.

ఏ వయసు వారికైనా

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లుగా ఉన్న నిబంధనను ఐఆర్‌డీఏఐ తొలగించింది. దీంతోపాటు ముందస్తు వ్యాధుల విషయంలో వేచి ఉండే వ్యవధిని నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. ఈ నేపథ్యంలో బీమా సంస్థలకు అధిక క్లెయింలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రీమియాలను సర్దుబాటు చేసేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

15 శాతం వరకు పెంపు

ప్రీమియం పెంచుతున్నట్లు ఇప్పటికే బీమా సంస్థలు పాలసీదారులకు సమాచారమిస్తున్నాయి. పాలసీలను బట్టి, కొత్త ప్రీమియం రేట్లు జులై, ఆగస్టు నుంచి అమలవుతాయని వెల్లడిస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం బీమా సంస్థల ప్రీమియం రేట్లు 10-15% అధికమయ్యే సూచనలున్నాయి. సాధారణ, స్టాండలోన్‌ ఆరోగ్య బీమా సంస్థలూ తమ పాలసీదారులకు ప్రీమియం పెంపు సమాచారాన్ని పంపిస్తున్నాయి.

ఏడాదికోసారి..

సాధారణంగా బీమా ప్రీమియాలు వయసును బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు 35 ఏళ్ల వరకు ఒకే ప్రీమియం ఉంటుంది. ఆ తర్వాత మారుతుంది. ఇలా 10-20% వరకు ప్రీమియం అధికమవుతుంది. దేశంలో సగటున ఈ పెంపు 15% ఉంటోంది. బీమా ప్రీమియాన్ని సంస్థలు మూడేళ్లకోసారి సమీక్షించేవి. క్లెయింలు, వైద్య ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ పెంపును నిర్ణయించేవి. దీనికి ఐఆర్‌డీఏఐ అనుమతి తీసుకోవాలి. గతంలో నియంత్రణ సంస్థ ఈ నిబంధనను సవరిస్తూ, బీమా సంస్థలకు ఏటా ప్రీమియం పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఈ పెంపు గురించి తప్పనిసరిగా ఐఆర్‌డీఏఐకు సమాచారం ఇచ్చి, ఆమోదం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బీమా సంస్థలు ప్రీమియం పెంచేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాయి.

పెద్దలకు కష్టమే..

65 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇవి ప్రామాణిక పాలసీల ప్రీమియం కంటే ఖరీదైనవిగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఉదాహరణకు 65 ఏళ్ల వ్యక్తికి రూ.10 లక్షల విలువైన బీమా పాలసీ అందించేందుకున్న ప్రీమియం ఇప్పుడు రూ.55,000 వరకు ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు 60 ఏళ్లు దాటిన వారికి ఇప్పటికే అధిక ప్రీమియం ఉంటోంది. పునరుద్ధరణ సమయంలో 15% వరకు పెంచితే, దాన్ని భరించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని