రైతన్న నెత్తిన శని.. జగనన్న!

రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు!

Published : 05 May 2024 06:57 IST

రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు!

జగన్‌మోహన్‌ రెడ్డి కన్నా పంటచేలల్లో దిష్టిబొమ్మలు చాలా నయం. కనీసం పక్షులను బెదరగొట్టడానికైనా అవి పనికొస్తాయి. నమ్మి ఓట్లేసి అధికారమిచ్చిన అన్నదాతలకు ఆ దిష్టిబొమ్మల పాటి సాయమైనా చేయలేదు జగన్‌. ‘‘ప్రతి రైతన్నకూ చెబుతున్నా.. మీకు నేనున్నాను’’ అంటూ 2019 ఎన్నికలప్పుడు ఊరూరా ఊదరగొట్టిన జగన్‌- సీఏంగా ఎవరిని ఉద్ధరించారు? కరవు రక్కసి కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న రైతులను వారి ఖర్మకు వారిని వదిలేశారు. ‘‘ప్రతి రైతన్నకూ మళ్లీ చెబుతున్నా.. పంటలకు కచ్చితంగా గిట్టుబాటు ధర కల్పిస్తాం. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ ఇస్తాం’’ అని ప్రతిపక్షనేతగా ప్రతిచోటా మాటిచ్చిన జగన్‌- ముఖ్యమంత్రిగా రైతాంగానికేం ఒరగబెట్టారు? పెట్టుబడికి తగినట్లుగా కనీస మద్దతు ధరలను పెంచకుండా రైతన్నల రెక్కలకష్టాన్ని రాబందుల పాల్జేశారు. ‘‘అన్నదాతల ముఖంలో చిరునవ్వే లక్ష్యంగా పాలన సాగిస్తాం’’ అంటూ వాగ్దానాల కుప్పపోసిన జగన్‌- అయిదేళ్లలో ఏం వెలగబెట్టారు? అప్పులపాలై బతుకులు భారమై బడుగు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తాడేపల్లి ప్యాలెస్‌లో తిష్ఠేసుకుని వేడుక చూశారు.

జాలిలేని మొండి బండరాజు

వెర్రి తెగులు సోకిన మొక్కలు పూత పూయవు. పాముపొడ తెగులు పట్టిన ఆకులన్నీ ఎండిపోతాయి. అలాగే, జగన్‌ చీడసోకిన రాష్ట్రంలో ఇప్పుడు రైతు కుటుంబాలు కన్నీటి మడుగుల్లో మునిగిపోయాయి. నిరుడు జూన్‌ నుంచి ఆంధ్రావనిలో కరవు విలయ తాండవం చేస్తోంది. కాడికట్టి దుక్కి దున్నలేని రైతన్నల నిస్సహాయత- ఖరీఫ్‌, రబీల్లో 45 లక్షల ఎకరాలను బీడుపెట్టింది. కరవు, మిగ్‌జాం తుపాను దెబ్బకు మరో 43 లక్షల ఎకరాల్లో పైర్లు దెబ్బతిన్నాయి. ఇక రైతులు ఏం తిని బతకాలి? భార్యాబిడ్డలను ఎలా పోషించుకోవాలి? రైతుల పరిస్థితే అగమ్యగోచరమైతే ఇక వ్యవసాయ కూలీల గతేంటి? ఇవన్నీ ఆలోచించి ఆపత్కాలంలో అన్నదాతలను ఆదుకోవాల్సిన జగన్‌- జాలిలేని మొండి బండరాజు అయ్యారు. మొన్న డిసెంబరులో మిగ్‌జాం తుపాను తీవ్రతకు 20 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. జగన్‌ ప్రభుత్వమేమో 6.64 లక్షల ఎకరాల్లోనే చేలు దెబ్బతిన్నట్లు కాకిలెక్కలు రాసుకుంది. చినుకు నేలకు దిగకపోవడం, పొలాలకు సాగునీరు అందకపోవడంతో ఖరీఫ్‌లో 23 లక్షల ఎకరాల్లో పంటలు పాడైపోయాయి. కళ్లుండీ కబోదిగా మారిన జగన్‌ సర్కారు- పంట నష్టాన్ని 14.21 లక్షల ఎకరాలకు తగ్గించి పారేసింది. రాష్ట్రంలో 466 మండలాల్లో దుర్భిక్షం ఛాయలు కనపడుతుంటే- అంతకంటే చాలా తక్కువ మండలాల్లోనే కరవుందన్న మొక్కుబడి ప్రకటనతో చేతులు దులుపుకొంది. పెట్టుబడి సాయం సొమ్ములను మిగుల్చుకునే కక్కుర్తితోనే పంట నష్టం అంచనాలను జగన్‌ ప్రభుత్వం తెగ్గోసేసింది. ‘మీకు కొండంత అండగా నేనుంటాను అని ప్రతి రైతన్నకూ హామీ ఇస్తున్నా’’ అని ప్రతిపక్షనేతగా మురిపించిన జగన్‌- ఎన్నికల ఏరు దాటాక తెప్ప తగలేసి రైతులను నిలువునా ముంచేశారు.

జగనన్న కానుకలంటే ఎండిన చేలే!

నవ్వుతూనే నయవంచనకు పాల్పడటంలో జగన్‌కు జగనే సాటి. కరెంటు కోతలతో పంటలెండిపోయి గుడ్లనీరు కక్కుకుంటున్న రైతాంగమే అందుకు సాక్ష్యం. ‘‘ప్రతి రైతుకూ పగటి పూటనే 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తాం’’ అని ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ నమ్మబలికారు. అలా ఇచ్చి వ్యవసాయాన్ని పండగ చేస్తానన్న పెద్దమనిషి- పదవిలోకి వచ్చాక అన్నదాతల కడుపు కొట్టారు. రాష్ట్రంలో చాలాచోట్ల వ్యవసాయానికి ఏడు గంటల పాటే కరెంటు ఇస్తున్నారు. అందులోనూ పగటి పూట ఇచ్చేది మూడు గంటలే. మిగిలింది అర్ధరాత్రి పన్నెండింటి నుంచి నాలుగింటి వరకు వస్తోంది. లోడ్‌ రిలీఫ్‌ వంకతో అందులోనూ కోత కోసేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉద్దేహాళ్‌లో లోకన్న అనే రైతు ఆరెకరాల్లో వరి వేశారు. కరెంట్‌ అగచాట్ల కారణంగా మూడెకరాల్లో పంటెండి పోయింది. లోకన్న ఒక్కరే కాదు- జగన్‌ జమానాలో ఇలా కడగండ్ల పాలైన కర్షకులెందరో ఉన్నారు. రోజుకు నాలుగు గంటల పాటైనా సరిగ్గా కరెంటు ఇవ్వట్లేదు, పంటలన్నీ పాడైపోతున్నాయంటూ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన 30 గ్రామాల రైతులు మొన్న ఫిబ్రవరిలో ఆందోళన బాటపట్టారు. నాలుగు రోజులుగా పొలాలకు విద్యుత్తు ఇవ్వట్లేదంటూ అంతకు ముందు పల్నాడు జిల్లా అన్నదాతలు ధర్నాకు దిగారు. అసలే కరవు కాలం.. ఆపై కరెంటు కష్టాలు.. నీటిచెమ్మ తగలక చేలు నెర్రలిస్తున్నాయి. వాటి వంక కన్నెత్తి చూడని వైకాపా అధినేత- ‘‘పగటిపూటే నాణ్యమైన ఉచిత కరెంట్‌ అంటే మీ బిడ్డ జగన్‌’’ అంటూ తనను తానే మెచ్చుకుని మేకతోలు కప్పుకొంటున్నారు.

నక్కబుద్ధుల్లో నంబర్‌ 1

చేసిన పాపం గోచీలో పెట్టుకుని కాశీకి పోయి, హరహరా అన్నాడట వెనకటికొకడు. జగన్‌ కూడా అంతే.. అధికారంలో ఉన్నన్నాళ్లూ అన్నదాతలకు నమ్మకద్రోహం చేసి ఇప్పుడు ఓట్లకోసం మళ్లీ ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ‘‘రాష్ట్రంలోని రైతులకు మన ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేయిస్తుంది’’ అని ప్రతిపక్షనేతగా రైతన్నలను బులిపించారు జగన్‌. ‘‘బోర్లు తవ్వించడమే కాదు.. మోటార్లు బిగించి, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తాం. కేసింగ్‌ పైపులు కూడా ఉచితంగానే అందించబోతున్నాం’’ అంటూ సీఎంగానూ వాగ్దానాల వరద పారించారు. ఆయన మాటలను నమ్మి 2.32 లక్షల మందికి పైగా రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ‘వైఎస్‌ఆర్‌ జలకళ’ పథకం కింద బోర్లేయించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తానన్న జగన్‌- దరఖాస్తుదారులకు ఘోర అన్యాయం చేశారు. మొన్న డిసెంబరు చివరి వారం నాటికి 23,935 బోర్లే తవ్వించారు. వాటిలోనూ కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చినవి కేవలం 4,795. పంపు సెట్లు బిగించిన బోర్లు అయితే 836 మాత్రమే! విద్యుత్‌ కనెక్షన్‌ ఉచితమని చెప్పి, ఆపై మడమ తిప్పేసిన జగన్‌ మూలంగా బడుగు రైతులపై రూ.8వేల కోట్ల అదనపు భారం పడింది. తెల్లారి లేచింది మొదలు విశ్వసనీయత వంకాయ కూర అంటూ కబుర్లు చెప్పే జగన్‌ నిజరూపమిది! తెదేపా హయాంలో ‘ఎన్టీఆర్‌ జలసిరి’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 33వేలకు పైగా బోర్లు తవ్వి, ఉచితంగా మోటార్లు అందించారు. రాయితీ మీద సోలార్‌ ప్యానెళ్లనూ సమకూర్చారు. ఆ పథకం పేరుమార్చి, దాని అమలును దిగజార్చి మొత్తం రైతులోకాన్నే ఏమార్చిన నంబర్‌1 నక్కబుద్ధులు జగన్‌వి!

‘‘నా చావుకు కారణం.. జగన్‌’’

‘‘రైతు భరోసా అంటే మీ జగన్‌.. ఉచిత పంటల బీమా అంటే మీ బిడ్డ జగన్‌’’ అంటూ వైకాపా అధినేత ఒకపక్క దరువేసుకుంటున్నారు. మరోవైపు.. పంటల బీమా రాలేదని కర్నూలు జిల్లా రైతు సుంకన్న ఆత్మహత్య చేసుకున్నాడు. సాగుకోసం చేసిన అప్పులను తీర్చే తోవ దొరకక అదే జిల్లా పి.చింతకుంటకు చెందిన యువరైతు దంపతులు సంజీవరెడ్డి, శ్రావణి బలవన్మరణాలకు పాల్పడ్డారు. ‘‘స్వయానా ముఖ్యమంత్రి జగన్‌ నా చావుకు కారణం..’’ అని లేఖ రాసి మరీ సీఎం సొంత జిల్లా తుడుములదిన్నె గ్రామరైతు వెంకట సుబ్బారెడ్డి పురుగుల మందు తాగి చనిపోయాడు. విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన అన్నదాతలు ఎర్నినాయుడు, లోవరాజులు కూడా అప్పుల బాధలు భరించలేక తనువులు చాలించారు. జగన్‌ కర్కశ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఎందరో రైతన్నలు ప్రాణాలు తీసుకున్నారు. మొన్న ఫిబ్రవరిలో కూడా జగన్‌ సొంత జిల్లా పొన్నంపల్లెకు చెందిన రైతు మారెన్న అలాగే కడతేరి పోయాడు. అప్పుల ఊబిలోంచి అన్నదాతలను బయటపడేయని జగన్‌- ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారాలనూ సరిగ్గా ఇవ్వలేదు. కౌలురైతులనైతే జగన్‌ మరీ దారుణంగా దగా చేశారు. ఏటా 15.36 లక్షల మందికి రైతుభరోసా ఇస్తామని హామీ ఇచ్చి- వారిలో 93శాతం మందికి మొండిచెయ్యి చూపించారు. పంట నష్టాలు, అప్పుల  బరువును తాళలేక కౌలు రోతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే మొద్దునిద్ర పోయారు. ‘‘మాది రైతు పక్షపాత ప్రభుత్వం’’ అంటూనే సాగుదారుల నోట్లో మట్టికొట్టిన మనిషి జగన్‌మోహన్‌ రెడ్డి. వినాశకర విధానాలతో అన్నదాతల ఆశల పంటలను దుంపనాశనం చేసిన జగన్‌- రాష్ట్రానికి పట్టిన అగ్గి తెగులు!


పచ్చిమోసాల్లో దిట్ట.. జగన్‌!

‘‘రైతు పంట వేయడానికి ముందే వారి ముఖాల్లో చిరునవ్వులు కనిపించే విధంగా ఆ పంటను ఫలానా రేటుతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటిస్తాం’’ అని ప్రతిపక్షనేతగా అన్నదాతలకు ఆశపెట్టారు జగన్‌. సీఎం అయ్యాక కూడా అలాంటి ప్రవచనాలనే యమజోరుగా వినిపించారు. ‘‘రైతులు కనీస మద్దతు ధరకంటే తక్కువకు పంటలు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఒక్క ధాన్యమే కాదు.. ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటలకూ కనీస మద్దతు ధర లభించేలా అధికారులు సవాల్‌గా తీసుకుని పనిచేయాలి’’ అని 2022లో జగన్‌ సెలవిచ్చారు. ‘‘రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని 2023లోనూ ధర్మోపదేశాలు చేశారు. ఇలా ప్రతిఏటా కోసిన కోతలే మళ్లీ మళ్లీ కోశారు తప్ప- గిట్టుబాటు ధరలిచ్చిన పాపాన పోలేదాయన. ఏటా కొన్ని పంటలకు కేంద్రం మద్దతు ధర(ఎంఎస్‌పీ)లను ప్రకటిస్తుంది. అవి పోను మిగిలిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందే ఎంఎస్‌పీ ప్రకటించి, ఆ ధరలకే కొంటామన్నది జగన్‌ వాగ్దానం. కేంద్రం తన జాబితాలోని పంటలకు ఎంఎస్‌పీలను ఏటా ఎంతోకొంత పెంచుతోంది. సాగుదారులపై దయలేని జగన్‌ సర్కారేమో 2019-20 నాటి మద్దతు ధరలనే ఇప్పటికీ కొనసాగిస్తోంది. నాలుగేళ్లలో సాగుఖర్చులు అధికమయ్యాయి. రైతులకు అవి మోయలేని భారాలవుతున్నాయి. అయినా జగన్‌ కరకు గుండె కరగలేదు. మద్దతు ధరలను పెంచలేదు. పెట్టుబడి ఖర్చులు, సాగుదారుల శ్రమ, భూమి విలువను పరిగణనలోకి తీసుకుని ఎంఎస్‌పీలను ఏటా నిర్ణయించాలి. రైతు జన బాంధవుడిగా పోజులుకొట్టే జగన్‌ అదేమీ పట్టించుకోలేదు. సకాలంలో పంటల సేకరణకూ పూనుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ పంటలను అయినకాడికి అమ్ముకున్నాక సేకరణ అంటూ హడావుడి చేయడం జగన్‌కు అలవాటైపోయింది. కిలో అరటికి రూ.8 చొప్పున ఎంఎస్‌పీ ప్రకటించి, అందులో సగం రేటుకు అదీ అరకొరగా కొనిపించడం వంటి పచ్చి మోసాల్లోనూ జగన్‌ దిట్ట!


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని