చైనాకు తల వంచొద్దు

 సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించి యదాస్థితి తిరిగి కొనసాగించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై...

Published : 20 Jun 2020 01:42 IST

అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి పార్టీల మద్దతు

దిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించి యథాస్థితి తిరిగి కొనసాగించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. భారత్ ‌- చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 20 రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని పార్టీలూ కేంద్రానికి తమ మద్దతు ప్రకటించాయి. కొన్ని పార్టీలు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరాయి.

‘‘సరిహద్దులో యథాతథ స్థితి కొనసాగుతుందని, చైనా తిరిగి తన అసలు స్థానానికి వెళ్తుందని దేశ ప్రజలు ఆశిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కోరుకుంటున్నారు’’ అని సోనియా అన్నారు. చైనా భారత్ భూభాగంలోకి ఎప్పుడు ప్రవేశించింది? సరిహద్దు వెంట చోటుచేసుకున్న కార్యకలాపాల గురించి నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించలేదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఈ విషయంలో తమ పార్టీ మద్దతు కేంద్రానికి ఉంటుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. చైనా ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచొద్దన్నారు. చైనా ప్రజాస్వామికదేశం కాదని, నియంతృత్వ దేశమన్నారు. తాను ఏం అనుకుంటుందో అదే చేస్తుందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అఖిలపక్ష సమావేశం దేశానికి మంచి సందేశం ఇస్తుందన్నారు. టెలికాం, రైల్వే, వైమానిక రంగాల్లోకి చైనాను అనుమతించొద్దని కోరారు. ఈ క్రమంలో కొన్ని సమస్యలు ఎదురైనా గానీ చైనాను మాత్రం అనుమతించొద్దన్నారు. ఇతర దేశాల ముందు అనైక్యతను ప్రదర్శించకూడదన్నారు.

దేశ వ్యాప్తంగా చైనా పట్ల నిరసన వ్యక్తమవుతోందని జేడీయూ చీఫ్‌, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ అన్నారు. మన మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసే ఉన్నామన్నారు. దేశభక్తి విషయానికి వచ్చేటప్పటికి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉంటాయని డీఎంకే అధినేత స్టాలిన్‌ అన్నారు. చైనా వ్యవహారంపై ఇటీవల ప్రధాని చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. పంచశీల ఒప్పందానికి భారత్‌ కట్టుబడి ఉండాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. భారత్‌ను తమ కూటమిలోకి లాగేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవాలన్నారు. భారత్ శాంతి కోరుకుంటోందంటే దానర్థం చేతగానితనం కాదని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. మనమందరం ఒక్కటేనన్నారు. అందరిదీ ఇదే అభిప్రాయమని చెప్పారు. ప్రధానితో అందరం ఉన్నామని, సైనిక బలగాలు, వారి కుటుంబాలతో ఉంటామని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని