Updated : 03/07/2020 17:34 IST

స్వపక్షంలో విపక్షంలా రఘురామకృష్ణరాజు

అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైకాపా ఎంపీల విజ్ఞప్తి‌

విశ్వాసం కోల్పోయారని విమర్శించిన విజయ సాయిరెడ్డి

దిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు‌ పిటిషన్‌ ఇచ్చామని వైకాపా సీనియర్‌ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని విషయాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సభాపతి హామీ ఇచ్చారని తెలిపారు. స్వపక్షంలో విపక్షం మాదిరిగా రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో అదే పార్టీపై విమర్శలు చేయడం విశ్వాస రాహిత్యమేనని స్పష్టం చేశారు.

‘రఘురామకృష్ణరాజు నైతిక విలువలు కోల్పోయారు. పార్టీలోని వారినే దూషించి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సొంత అవసరాల కోసం ప్రతిపక్షాలతో లాలూచీ పడ్డారు. దిగజారి మాట్లాడిన మాటలే ఆయన నైతిక విలువలు పడిపోయాయి అనేందుకు నిదర్శనం. ఊహాజనితమైన అంశాలను ఊహించుకొని ప్రజలకు సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఏదైనా విషయంపై స్పష్టత కావాలంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలి తప్ప ప్రజావేదికలపైకి రావొద్దు. విభేదాలు ఉంటే పార్టీ అధ్యక్షుడికి చెప్పుకోవాలి. అలా వ్యవహరించకపోవడం పార్టీ విధివిధానాలకు వ్యతిరేకం. ఆయన మాటతీరు, వ్యవహారశైలి విశ్వాస రాహిత్యాన్ని సూచిస్తున్నాయి’ అని విజయ సాయిరెడ్డి అన్నారు.

‘ఆయనపై ఉన్న కేసులు, స్వలాభాపేక్షతో రఘురామకృష్ణరాజు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. పార్టీలో ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే, కార్యకర్తకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. అయితే దానిని దుర్వినియోగం చేయరాదు. ప్రతిదానికీ కొన్ని పరిమితులు ఉంటాయి. ఆయన రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలు 10వ షెడ్యూలులో పొందుపరిచిన ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా ఉందనడంలో సందేహం లేదు. పార్టీకి ప్రతి ఒక్కరూ మనసా, వాచా, కర్మణా పనిచేయాలి. రఘురామకృష్ణరాజు భౌతికంగా పార్టీలో ఉన్నప్పటికీ మనస్ఫూర్తిగా లేరు. పార్టీకి విధేయులుగా ఉండటంలో ఆయన విఫలమయ్యారు. అందుకే చర్యలు తీసుకోక తప్పలేదు’ అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.

జగన్‌ సముచిత స్థానం ఇచ్చినా..: మిథున్‌రెడ్డి

రఘురామకృష్ణరాజుకు ముఖ్యమంత్రి జగన్‌ పార్టీలో సముచిత స్థానం కల్పించారని వైకాపా లోక్‌సభా పక్షనేత మిథున్‌ రెడ్డి అన్నారు. మాగుంట, బాలశౌరి, వంగా గీతా వంటి సీనియర్లు ఉన్నప్పటికీ కమిటీ ఛైర్మన్‌గా నియమించారని పేర్కొన్నారు. ఎందులోనూ తక్కువ చేయకుండా అన్ని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారని వెల్లడించారు. కానీ  తెలుగుదేశం హయాంలో తీసుకున్న నిర్ణయాలకు తమను బాధ్యులను చేయడం సరికాదన్నారు.

అంగుళం భూమి విక్రయించనప్పటికీ తానే తితిదే భూముల అమ్మకాన్ని అడ్డుకున్నట్టు రఘురామకృష్ణరాజు చెప్పుకున్నారని మిథున్‌రెడ్డి విమర్శించారు. ఇతర వ్యవహారాల్లోనూ ఆయన పార్టీని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన విలువను కాపాడుకోకుండా పార్టీ నేతలనే దూషించడం దురదృష్టకరమని వెల్లడించారు. తెదేపా, భాజపాలో చేరిన నేతల ప్రోద్బలంతో ఆయన ఇలా చేయడం బాధాకరమన్నారు. అనర్హత అంటే చిన్న విషయం కాదని పార్టీ పెద్దలంతా వివరంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పార్టీ వివరణ కోరినప్పటికీ ఆయన ఇచ్చిన జవాబు బాగాలేదని వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ అనే పదానికీ వక్రభాష్యం చెప్పడం సరికాదని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో వైకాపా చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ సహా ఎంపీలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని