సరిహద్దు వివాదం: రాహుల్‌ మూడు ప్రశ్నలు

గత కొద్ది కాలంగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల విషయమై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు...

Published : 07 Jul 2020 17:24 IST

దిల్లీ: గత కొద్ది కాలంగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల విషయమై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం ఆయన మరో సారి కేంద్రంపై విమర్శలు చేశారు. జాతీయ ప్రయోజనాలను రక్షించడంలో కేంద్రం విఫలమైందని, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి యథాతథస్థితి కొనసాగించేందుకు కేంద్రం ఎందుకు పట్టుబట్టలేదని,  ప్రాదేశిక సమగ్రత గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

ఆదివారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో వీడియో కాల్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత చైనా బలగాలు కిలోమీటరు మేర వెనక్కి వెళ్లాయి. అయితే చైనా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాత్రం ‘‘భారత్‌-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జరిగిన తప్పొప్పులు ఎవరివనేది చాలా స్పష్టంగా ఉంది. చైనా సరిహద్దు ప్రాంతాలలో తన భూభాగాన్ని, ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది’’ అని పేర్కొంది.

దీనికి సంబంధించిన ప్రకటనను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ రాహుల్ గాంధీ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘అన్నింటికన్నా జాతీయ ప్రయోజనాలు ఎంతో ముఖ్యం. వాటిని  కాపాడటం భారత ప్రభుత్వం విధి.  అటువంటప్పుడు  1. సరిహద్దుల్లో యథాస్థితిని కొనసాగించేందుకు ప్రభుత్వం ఎందుకు పట్టుబట్టలేదు?

2. మన దేశానికి చెందిన నిరాయుధులైన 20 మంది సైనికుల మరణాలను సమర్థించుకోవడానికి చైనాను ఎందుకు అనుమతించారు?

3. గల్వాన్‌ లోయ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఎందుకు ఎక్కడా ప్రస్తావించలేదు?’’ అంటూ చైనా విడుదల చేసిన పత్రికా ప్రకటన కాపీని ట్వీట్‌కు జోడించారు.

సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఇరు దేశాల నాయకుల మార్గదర్శకత్వంలో వివాదాలుగా మారకుండా ఉండేందుకు ఏకాభిప్రాయంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అలానే ఎల్ఏసీ వెంట రెండు దేశాలకు చెందిన బలగాలను ఉపసంహరించుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించినట్లు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని