తెలంగాణలో జనసేన ఎమ్మెల్యేలుండాలి: పవన్‌

తెలంగాణ సంక్షేమానికి సరైనదనిపిస్తే అవసరాన్ని బట్టి పొత్తుకు సిద్ధంగా ఉందామని.. ఈ రాష్ట్ర శాసనసభలో జనసేన ఎమ్మెల్యేలు కనీసం 10 మంది ఉండాలన్నదే తన కోరిక అని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Updated : 25 Jan 2023 05:17 IST

పరిమిత స్థానాల్లో నిలబడతాం
7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ
ఏపీలో ఇప్పటికే భాజపాతో దోస్తీ
పరిస్థితులను బట్టి పొత్తులు
రెండుచోట్లా ఓట్లు చీలకూడదనేదే నా ఉద్దేశం
ఏపీ కంటే తెలంగాణలోనే అభివృద్ధి జరిగింది
కొండగట్టులో ‘వారాహి’కి పవన్‌కల్యాణ్‌ పూజలు

ఈనాడు, కరీంనగర్‌; న్యూస్‌టుడే- మల్యాల, కొడిమ్యాల: తెలంగాణ సంక్షేమానికి సరైనదనిపిస్తే అవసరాన్ని బట్టి పొత్తుకు సిద్ధంగా ఉందామని.. ఈ రాష్ట్ర శాసనసభలో జనసేన ఎమ్మెల్యేలు కనీసం 10 మంది ఉండాలన్నదే తన కోరిక అని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టులో అంజన్న దేవాలయాన్ని ఆయన దర్శించుకుని.. తన ప్రచార వాహనం ‘వారాహి’కి పూజ చేయించారు. నాచుపల్లి సమీపంలోని రిసార్ట్‌లో పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశమై భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు సందేశం ఇచ్చే స్థాయిలో తానులేనని.. ఇక్కడి ప్రజలనుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నానన్నారు.

మనమంతా కొత్తవాళ్లమే..

రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీల్లో కొత్తవాళ్లు ఎక్కువగా లేరని.. జనసేనలో యువతరానికి అవకాశాలున్నాయన్నారు. తెలంగాణలో మైనింగ్‌ దోపిడీ ఎక్కువగా జరుగుతోందన్నారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు సాగించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆంధ్రాలో కులాల గీతల మధ్యలో రాజకీయం చేయాల్సి వస్తోందన్నారు. ఏపీలో ఉన్న కొందరు రాజకీయ నాయకులు మామూలువారు కాదని.. సొంత బాబాయినే చంపుకొనేవారని.. న్యాయవ్యవస్థను ఇష్టానుసారంగా తిట్టేవారని ఎద్దేవా చేశారు. అక్కడ తాను ఏది సాధించినా.. అది తెలంగాణ స్ఫూర్తితోనేనని స్పష్టం చేశారు.

ఏడుకు తగ్గకుండా.. 14కు మించకుండా..

ఏడుకు తగ్గకుండా.. 14కు మించకుండా తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నామని చెప్పారు. పరిమిత సంఖ్యలోనే అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెడతామన్నారు. ఇక్కడతమ పార్టీ భావజాలానికి దగ్గరగా ఉన్నవారితో పొత్తు పెట్టుకునే విషయమై ఆలోచిస్తామన్నారు. ఏపీలో భాజపాతో ఇప్పటికే దోస్తీ ఉందని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి పొత్తులపై తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్యంలో ఓట్లు చీలిపోకూడదనేది తన ఉద్దేశమని, ఈ దిశగా నోటాకు వేసేవారికి కూడా అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తెలంగాణలో పోలీసు ఉద్యోగానికి ఇన్ని పరీక్షలుంటే ప్రజాప్రతినిధులకు ఎన్ని పరీక్షలుండాలని ఆయన అన్నారు. వీలును బట్టి తెలంగాణలో నియోజకవర్గాల్లో పర్యటిస్తానన్నారు.

తనకు పునర్జన్మనిచ్చింది కొండగట్టు అంజన్న స్వామేనని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. తమ ఇంటి ఇలవేల్పు ఆంజనేయస్వామి అని తెలిపారు. 2008లో తనకు ప్రాణగండం ఉందని కొందరు చెబితే పట్టించుకోలేదని.. వాళ్లు చెప్పినట్లుగానే 2009 ఎన్నికల ప్రచార సమయంలో హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు తగిలి తన జుత్తు కాలిపోయిందని గుర్తుచేసుకున్నారు. కింద ఉన్న అందరికీ షాక్‌ కొట్టినా, తనకు ఏమీ కాలేదన్నారు. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నస్వామి అంటే అమితమైన విశ్వాసం కలిగిందన్నారు. దుష్టులను శిక్షించి.. మంచివారిని రక్షించే వారాహి అమ్మవారి పేరును తన వాహనానికి పెట్టుకున్నానని చెప్పారు.

గెలవలేమనే ఏపీ సర్కారు ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ తిరగకూడదనే ఉద్దేశంతోనే అక్కడి ప్రభుత్వం జీవో నంబరు 1 తీసుకొచ్చిందని.. వారికి 175 సీట్లు వస్తాయన్న విశ్వాసం లేక ఇవన్నీ చేస్తున్నారన్నారు. మళ్లీ ప్రభుత్వాన్ని స్థాపించలేరనేందుకు ఇవన్నీ సంకేతాలన్నారు. రాజకీయ కారణాలతోనే ఏపీలో వారాహి వాహనానికి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తాను ఎంతవరకు చేయగలననే పరిమితితో ఉంటానే తప్ప, అతిగా ఊహించుకోనన్నారు. భారాస ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అది ఆహ్వానించతగినదేనని సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే కచ్చితంగా తెలంగాణలో అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణ, ఏపీలో సమస్యలు వేర్వేరని, రెండిటినీ పోల్చి చూడలేమన్నారు. ఏపీలో భాజపాకు చెందిన నేతలు జనసేనలోకి వస్తున్నారనే విషయమై స్పందిస్తూ.. భాజపాతో పొత్తులో ఉన్నందున ప్రస్తుతానికి ఏమీ మాట్లాడబోనన్నారు. జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి నిర్ణయాలకు కొంత అభిప్రాయ భేదాలుంటాయని అన్నారు.

ధర్మపురి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో పూజలు

అనుష్ఠుప్‌ యాత్రలో భాగంగా 32 నారసింహ క్షేత్రాలను దర్శించుకోవాలని నిర్ణయించుకున్న పవన్‌ పార్టీ నేతల సమావేశం అనంతరం.. ధర్మపురికి పయనమయ్యారు. అక్కడ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ధర్మపురి వెళ్లే మార్గంలో ఆయన కారు చక్రం పంక్చర్‌ కాగా, మరమ్మతు అనంతరం ప్రయాణం కొనసాగింది. ధర్మపురి నుంచి ఆయన హైదరాబాద్‌కు పయనమయ్యారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని