పార్టీ వీడినవారు తిరిగొచ్చేయండి

భాజపా సైద్ధాంతిక భావాలను కలిగిఉండి.. చిన్న చిన్న సమస్యలు, భావోద్వేగాలతో పార్టీని వీడిన నేతలంతా తిరిగి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

Published : 28 Jan 2023 06:33 IST

భాజపా ప్రభుత్వంతో ప్రజాస్వామ్య తెలంగాణ సాధించుకుందాం
బండి సంజయ్‌ పిలుపు  

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా సైద్ధాంతిక భావాలను కలిగిఉండి.. చిన్న చిన్న సమస్యలు, భావోద్వేగాలతో పార్టీని వీడిన నేతలంతా తిరిగి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలసిరావాలన్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకుందామని చెప్పారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజయ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ఛుగ్‌, నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, వివేక్‌, బాబూమోహన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారిణిగా విజయశాంతి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారన్నారు. సాధారణ కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరికీ భాజపాలో అవకాశాలు వస్తాయని గుర్తించాలని చెప్పారు. విజయశాంతి.. భాజపాలోనే 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.

తెలంగాణ పేరుతో కొందరు మోసం చేశారు: విజయశాంతి

అవినీతిలేని క్రమశిక్షణ పార్టీ కావడంతోనే భాజపాలో చేరినట్లు విజయశాంతి తెలిపారు. కొందరు తెలంగాణ పేరుతో తనని మోసం చేశారని చెప్పారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ఓడించేందుకు ప్రయత్నం చేశారన్నారు. ఈ సారి గట్టిగా పనిచేస్తే భాజపా అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని