మీ ప్రకటన సుప్రీంకోర్టు ధిక్కరణ కాదా?

‘రాష్ట్రం మీ సొంత జాగీరా? ఇష్టం వచ్చినట్లు పరిపాలిస్తామంటే కుదరదు. రాజ్యాంగవ్యవస్థలను నాశనం చేస్తామంటే న్యాయస్థానాలు ఊరుకోవు.

Published : 03 Feb 2023 04:45 IST

విశాఖను రాజధానిగా ఎలా ప్రకటించారు?
సీఎం, మంత్రులపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు
జైభీమ్‌ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రం మీ సొంత జాగీరా? ఇష్టం వచ్చినట్లు పరిపాలిస్తామంటే కుదరదు. రాజ్యాంగవ్యవస్థలను నాశనం చేస్తామంటే న్యాయస్థానాలు ఊరుకోవు. హైకోర్టు ఫిర్యాదుచేస్తే ఇంతవరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇదా పాలన..?’ అంటూ ప్రభుత్వంపై జైభీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. విశాఖ రాజధాని కాబోతోందని ప్రకటించిన సీఎం జగన్‌తో పాటు స్పీకర్‌ తమ్మినేని సీతారాం, నలుగురు మంత్రులపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదుచేయాలని సుప్రీంకోర్టుకు లేఖ రాశామని చెప్పారు. గురువారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

వ్యవస్థలు నాశనం

‘జగన్‌ వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేస్తున్నారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు వాస్తవాలని నమ్ముతున్నాం. ప్రతిపక్షనాయకులు, సామాజికన్యాయం కోసం పోరాడే మాలాంటివారి ఫోన్లూ ట్యాప్‌ చేస్తున్నారని నమ్ముతున్నాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి. కొన్ని జీవోలను హైకోర్టు కొట్టేసిందని.. 2020లో సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై ట్రోలింగ్‌ చేశారు. దీనిపై సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌కు హైకోర్టు రిజిస్ట్రార్‌ మూడుసార్లు ఫిర్యాదుచేశారు. కనీసం ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయలేదు. ఓ వెబ్‌లింకు ద్వారా న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నట్లు కథనం వచ్చింది. దీనిపై సీఐడీ విచారణ ఏది?’ అని ప్రశ్నించారు. ‘ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌కు చెందిన ఐప్యాక్‌ టీం అందరి ఫోన్లు ట్యాప్‌ చేస్తోంది. దానికి కావల్సిన యంత్రాంగాన్ని, యంత్రాలను సీఎం సమకూర్చారు’ అని శ్రావణ్‌కుమార్‌ ఆరోపించారు.


రాజధానిని ఆరునెలల్లో  నిర్మించాలనే అంశంపైనే స్టే ఉంది  

‘రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉంది. విశాఖ రాజధాని అని చెప్పడం కోర్టుధిక్కరణ కాదా..? అమరావతిని ఆరునెలల్లో నిర్మించాలనే అంశంపైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాజధాని మార్పుపై ఇప్పుడు మాట్లాడటం సరికాదు. సీఎంతో పాటు శాసనసభాపతి, మంత్రులు బొత్స, ధర్మాన, అమర్‌నాథ్‌, సీదిరి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి రాజధానిపై ప్రకటనలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు, అటార్నీ జనరల్‌కు లేఖ రాస్తున్నాం. నెల రోజుల్లోగా కోర్టు చర్యలు తీసుకోకపోతే మేమే వ్యాజ్యం దాఖలుచేస్తాం’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు