గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిన ప్రభుత్వం

తెలంగాణ ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌తో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

Updated : 04 Feb 2023 04:11 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌తో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల జై తెలంగాణ నినాదాన్ని విస్మరించినా గవర్నర్‌ మాత్రం జై తెలంగాణ అని చెప్పి ప్రసంగాన్ని ముగించడం ఆమె గొప్పదనానికి నిదర్శనమన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి వాటిని నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. మైనార్టీలకు కేంద్రం ఇస్తున్న నిధులను అందిపుచ్చుకోవడంలేదని, ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల వివరాలు పంపకపోవడం ద్వారా విద్యార్థులకు రూ.250 కోట్ల లబ్ధి అందకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. కేంద్రం ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా నెలకు 75 వేల ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తుంటే రాష్ట్రం ఉద్యోగ ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న తోడ్పాటును కూడా గవర్నర్‌ ప్రసంగంలో చెప్పి ఉంటే బాగుండేదన్నారు.


ప్రజలను మభ్యపెట్టే యత్నం

సంజయ్‌

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ చేత ప్రభుత్వం అసత్యాలు చెప్పించడం బాధాకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, విద్య, వైద్య వ్యవస్థలు కునారిల్లుతున్నాయని విమర్శించారు. విద్యుత్తు రంగం వేల కోట్ల నష్టాలపాలైతే.. వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నట్లు పేర్కొనడం దుర్మార్గమన్నారు. దళిత బంధు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీల సంక్షేమంపైనా గవర్నర్‌ ప్రసంగంలో అసత్యాలను చేర్చి కేసీఆర్‌ ప్రభుత్వం అవమానించిందని ధ్వజమెత్తారు.


విద్యుత్‌ కోతలు.. ధరణి బాధలు వర్ణనాతీతం

ఈటల, రఘునందన్‌

నేక సమస్యలతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులుండగా.. అంతా బాగుందంటూ బాకా ఊదుకోవడానికి గవర్నర్‌ తమిళిసై ద్వారా ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావులు విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం వారు అసెంబ్లీ మీడియా కేంద్రం వద్ద మాట్లాడారు. ‘వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ ఇస్తున్నట్లు గవర్నర్‌ ప్రసంగంలో చెప్పారు. విద్యుత్‌శాఖ సీఎండీ ప్రభాకర్‌రావే వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ ఇవ్వలేమని ప్రకటిస్తే.. ప్రభుత్వం మాత్రం అబద్ధాలు చెబుతోంది. సీఎం స్వగ్రామం చింతమడకలోనూ 24 గంటల వ్యవసాయ విద్యుత్‌ లేదు ధరణి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 20 లక్షల మంది రైతుల సర్వే నంబర్లు తప్పుగా పడ్డాయి. ఒకరి భూమి మరొకరి పేరుతో నమోదై ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌ మినహా రాష్ట్రంలో ఎక్కడా రెండు పడకగదుల ఇళ్లు కనిపించడమే లేదు’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని