ముప్పు ఆధారంగా కాదు.. సంబంధాలకు అనుగుణంగానే!

రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు వారికున్న ముప్పు ఆధారంగా కాకుండా... ప్రభుత్వంతో వారికున్న సంబంధాలను బట్టి భద్రత లభిస్తోంది.

Published : 05 Feb 2023 05:29 IST

ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించే  విషయంలో ప్రభుత్వం, పోలీసుల తీరిదీ
తాజాగా కోటంరెడ్డికి.. మొన్న ఆనం  రామనారాయణరెడ్డికి భద్రత కుదింపు

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌-నెల్లూరు: రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు వారికున్న ముప్పు ఆధారంగా కాకుండా... ప్రభుత్వంతో వారికున్న సంబంధాలను బట్టి భద్రత లభిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేల భద్రత విషయంలో వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనం. వైకాపా ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇటీవల వరకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్‌తో భద్రత ఉండేది. వారిద్దరూ రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగడుతూ, వైకాపాపై తిరుగుబాటు చేయటమే తరువాయి... వారికున్న భద్రతను 1 ప్లస్‌ 1కు కుదించేశారు. వైకాపా ప్రభుత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గత నెలలో పలు విమర్శలు చేశారు. అంతే జనవరి 14న ఆయనకు సమాచారమివ్వకుండానే... పోలీసులు భద్రతను తగ్గించేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రెండు రోజుల కిందట ప్రభుత్వంపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేశారు. అదే నేరమన్నట్లుగా ఆయనకు కల్పిస్తున్న భద్రతనూ శనివారం నుంచి కుదించేశారు. రెండు రోజులుగా తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, బూరగడ్డ అనిల్‌ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ మరీ బెదిరించారని కోటంరెడ్డి వెల్లడించారు. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉంది. పైగా ఇది మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు మరింత భద్రత కల్పించాల్సిందిపోయి ఉన్నది కుదించేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అదనంగా కల్పించిందే తీసేశాం

శ్రీధర్‌రెడ్డికి భద్రత కుదింపుపై ఏఆర్‌ డీఎస్పీ గాంధీని వివరణ కోరగా... ‘ఎమ్మెల్యేలకు 1 ప్లస్‌ 1 భద్రతే ఉంటుంది. కోటంరెడ్డి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్న నేపథ్యంలో భద్రత కల్పించాలని కోరడంతో 2 ప్లస్‌ 2 భద్రత కల్పించారు. అదనంగా కల్పించిన భద్రతనే ఇప్పుడు వెనక్కి తీసుకున్నాం. భద్రత కుదించలేదు’ అని చెప్పారు. ‘జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరికీ సెక్యూరిటీ స్కేల్‌ ఆధారంగానే 1 ప్లస్‌ 1 భద్రత కల్పిస్తున్నాం. ఏ ఎమ్మెల్యేకి గన్‌మెన్‌ను తొలగించలేదు’ అని నెల్లూరు జిల్లా ఏఆర్‌ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవంగా నెల్లూరు జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలు పలువురికి 2 ప్లస్‌ 2 భద్రతే కల్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని