అభివృద్ధి పనుల కోసం వైకాపా ఎంపీటీసీ సభ్యుడి రాజీనామా!

గుంటూరు జిల్లా తెనాలి మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది.

Published : 06 Feb 2023 04:00 IST

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తెనాలి మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. సమావేశంలో కొలకలూరు-2 వైకాపా ఎంపీటీసీ సభ్యుడు కాలిశెట్టి ఫణికుమార్‌ మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగటం లేదని, తీర్మానాలు చేసిన పనులు కూడా మొదలుపెట్టలేదని విమర్శించారు. ఇందుకు తాను కారణం కాకూడదని భావిస్తూ రాజీనామా చేస్తున్నానని తెలిపారు. రాజీనామా పత్రాన్ని ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావుకు ఇచ్చారు. వచ్చే నెల 1లోగా పనులు ప్రారంభిస్తామని ఎంపీపీ చెప్పారు. దీంతో స్పందించిన ఎంపీటీసీ సభ్యుడు గడువులోగా పనులు ప్రారంభం కాకుంటే తన రాజీనామాను పరిగణనలోకి తీసుకోవాలని సమావేశం నుంచి వెళ్లిపోయారు. చేసిన పనులకు బిల్లులు రాకుంటే పనులు ఎలా చేస్తామని తేలప్రోలు సర్పంచి బాషా పేర్కొన్నారు. తాను గ్రామంలో రూ.15 లక్షల పనులు చేయిస్తే బిల్లులు చేయటానికి కమీషన్లు అడుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడతానంటూ ఎంపీపీ ఆయనను సముదాయించారు. గ్రామాల్లో పనులు కావటం లేదని, ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని