పశ్చిమ రాయలసీమలో తెదేపా జయకేతనం

హోరాహోరీగా సాగిన పశ్చిమ రాయలసీమ (కడప, అనంతపురం, కర్నూలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు.

Published : 19 Mar 2023 04:52 IST

ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి
వైకాపా అభ్యర్థిపై 7,543 ఓట్ల ఆధిక్యంతో గెలుపు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: హోరాహోరీగా సాగిన పశ్చిమ రాయలసీమ (కడప, అనంతపురం, కర్నూలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డిపై 7,543 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గురువారం ఉదయం 8 గంటలకు అనంతపురంలోని జేఎన్‌టీయూ ప్రాంగణంలో లెక్కింపు మొదలై శనివారం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. చివరగా 49వ రౌండ్‌ ముగిసేసరికి రామగోపాల్‌రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, రవీంద్రరెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయి. తెదేపా అభ్యర్థి గెలుపొందినట్లు ఎన్నికలఅధికారి నాగలక్ష్మి సెల్వరాజన్‌ ప్రకటించారు. అయినా డిక్లరేషన్‌ పత్రం ఇవ్వలేదు. దీనిపై తెదేపా శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్నికల్లో 49 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 3,30,124 ఓట్లకు గాను 2,45,513 ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లు 19,108 ఉండగా 2,26,405 ఓట్లు లెక్కించారు. ఒక్కో రౌండ్‌కు 24వేల చొప్పున 11 రౌండ్లలో మొదటి ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి వైకాపా అభ్యర్థి రవీంద్రరెడ్డికి 95,969, తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 94,149 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసేసరికి వైకాపా అభ్యర్థి 1,820 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొమ్మిది రౌండ్లలో ఆధిక్యం కనబరుస్తూ వచ్చారు. రెండు రౌండ్లలో తెదేపాకు స్వల్ప ఆధిక్యం దక్కింది. పీడీఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజుకు 18,758 ఓట్లు, భాజపా బలపరిచిన నగరూరు రాఘవేంద్రకు 7,412 ఓట్లు వచ్చాయి.

కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓటు

మొదటి ప్రాధాన్యంలో ఎవరికీ కోటా రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. ఇందులో వైకాపా అభ్యర్థికి ఆధిక్యం తగ్గుతూ వచ్చింది. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరిగా ఎలిమినేట్‌ చేస్తూ.. వారికి వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్లను మిగిలినవారికి పంచుతూ వచ్చారు. మొత్తం 48 రౌండ్లలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయింది. 46వ రౌండ్‌లో స్వతంత్ర అభ్యర్థి కమ్మూరు నాగరాజు ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించగా వైకాపా ఆధిక్యం 1066కు తగ్గింది. 47వ రౌండ్‌లో భాజపా అభ్యర్థి నగరూరు రాఘవేంద్రను ఎలిమినేట్‌ చేశారు. ఆయన ఓట్లలో 3,312 రెండో ప్రాధాన్యంగా తెదేపా అభ్యర్థి రామగోపాల్‌రెడ్డికి రాగా.. 1,237 వైకాపా అభ్యర్థి రవీంద్రరెడ్డికి వచ్చాయి. తెదేపాకు 99,895, వైకాపాకు 98,886 దక్కాయి. ఈ రౌండ్‌తో తెదేపా 1009 ఓట్ల ముందంజలోకి చేరింది. చివరి రౌండ్‌గా పీడీఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజును ఎలిమినేట్‌ చేశారు. ఆయన ఓట్లలో 9,886 తెదేపా అభ్యర్థికి వచ్చాయి. వైకాపా అభ్యర్థి 3,352 ఓట్లు పొందారు. ఈ క్రమంలో రామగోపాల్‌రెడ్డికి 1,09,781, రవీంద్రారెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయి.

కలిసొచ్చిన అవగాహన

ఎన్నికలకు రెండు రోజుల ముందు తెదేపా, పీడీఎఫ్‌ మధ్య అవగాహన కుదిరింది. రెండో ప్రాధాన్య ఓటు ఒకరికొకరు వేసుకోవాలని నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యంలో 1820 ఓట్లు వెనకబడ్డ తెదేపా రెండో ప్రాధాన్య ఓట్లతో నెగ్గింది. పీడీఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజునుంచి వచ్చిన ఓట్ల కారణంగా ఆ ఒక్క రౌండ్‌లోనే తెదేపాకు 6,534 ఓట్ల ఆధిక్యం దక్కింది. ఇదే గెలుపులో కీలకమైంది. అభ్యర్థి ఎంపిక మొదలుకొని ఓట్ల లెక్కింపు వరకు వ్యూహాత్మకంగా పావులు కదపడం తెదేపాకు కలసివచ్చింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని