Nara Lokesh: రాష్ట్రంలో దళితులకు రక్షణ ఏదీ?

సీఎం జగన్‌ది చెత్తపాలన అని తాము మాత్రమే అనడం లేదని, సొంత పార్టీ ఎమ్మెల్యేలూ విమర్శిస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated : 28 Mar 2023 06:32 IST

జగన్‌ది చెత్త పాలనని వైకాపా ఎమ్మెల్యేలే అంటున్నారు
యువగళం పాదయాత్రలో లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: సీఎం జగన్‌ది చెత్తపాలన అని తాము మాత్రమే అనడం లేదని, సొంత పార్టీ ఎమ్మెల్యేలూ విమర్శిస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైకాపాను శాశ్వతంగా డిస్మిస్‌ చేస్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అంటున్నారు. 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని మరో శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి చెబుతున్నారు. జగనన్న ఇళ్లు పెద్ద కుంభకోణమని ఎమ్మెల్యే శ్రీదేవి వివరించారు. ప్రశ్నించిన వారిని జగన్‌ అణచివేస్తున్నారని ఆనం రామనారాయణరెడ్డి ఆరోపిస్తున్నారు..’ అని లోకేశ్‌ వివరించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గుమ్మయ్యగారిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ కరోనాకంటే ప్రమాదకరమని సొంత పార్టీ నాయకులే అంటున్నారని విమర్శించారు. ఏపీలో రైతులు పండించిన ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వైద్య కళాశాలలు నిర్మిస్తామన్న జగన్‌ ఒక్క ఇటుకైనా పేర్చారా? అని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని పూడ్చుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలియడం లేదన్నారు.

వైకాపాలో రెండు రాజ్యాంగాలు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైకాపాలో రెండు వర్గాలు ఏర్పడ్డాయని లోకేశ్‌ వివరించారు. ఒక వర్గం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, దానికి అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. మరో వర్గం అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, దానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అధ్యక్షురాలిగా ఉన్నారని వివరించారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలుచేసే వర్గంలో 50 మంది ఎమ్మెల్యేలున్నారని చెప్పారు. అంబేడ్కర్‌ వర్గం బలం రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10శాతం రిజర్వేషన్‌ తగ్గించడం ద్వారా రాష్ట్రంలో 16,500 మంది పదవులకు దూరమయ్యారని లోకేశ్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. జగన్‌ పాలనలో దళితులకు రక్షణ లేదని, సీఎం సొంత జిల్లాలోనే డాక్టర్‌ అచ్చెన్నను అత్యంత దారుణంగా హతమార్చారని ఆరోపించారు. దళితుల కోసం గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన 27 పథకాలను రద్దు చేశారన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కాలవ శ్రీనివాసులు, అమరనాథ్‌రెడ్డి, పరిటాల సునీత, శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, నాయకులు బీటీ నాయుడు, బీవీ వెంకట్రాముడు, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని