Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు.. తుది దశ ప్రచారమే కీలకం..ఎందుకో తెలుసా?

కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోలింగ్‌కు మరో 15 రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారానికి పదును పెడుతున్నాయి.ఈ  కీలకమైన సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Published : 26 Apr 2023 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. మరో 15 రోజుల్లో పోలింగ్‌ ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ఎత్తుగడలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌, జేడీఎస్‌కు తుదిదశ ఎన్నికల ప్రచారం కీలకంగా మారనుంది. వారం రోజుల క్రితం వరకు అభ్యర్థులెవరనే దానిపై పూర్తిస్థాయిలో స్పష్టత రాకపోవడంతో చాలా చోట్ల ప్రచారం జోరందుకోలేదు. ఈ నేపథ్యంలో వచ్చే 15 రోజుల సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని రాజకీయ పార్టీలన్నీ ప్రణాళికలు రచిస్తున్నాయి. జాతీయ స్థాయి నాయకులైన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను భాజపా ప్రచారానికి దించుతోంది. మరోవైపు, కాంగ్రెస్‌ కూడా పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో ప్రచార పర్వం కొనసాగిస్తోంది  

మోదీ ఛరిష్మాతో భాజపా

చివరి దశ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా మోదీ, అమిత్ షాలపైనే అధికార భాజపా ఆశలు పెట్టుకుంది. వీరిద్దరికీ తోడుగా నడ్డా కూడా తనదైన శైలిలో పార్టీ విజయానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుండగా.. భాజపా మాత్రం ఎక్కువగా మోదీ ఛరిష్మాపైనే ఆధారపడుతోంది. అంతేకాకుండా అస్సాం, మహారాష్ట్ర, కేరళ, గోవా, తమిళనాడు నుంచి ప్రత్యేక బృందాలను భాజపా దింపింది. కర్ణాటకలో ఉండే ఆయా రాష్ట్రాల ప్రజల ఓట్లను ఆకర్షించేందుకే కమలదళం ఈ ఎత్తుగడను అమలు చేస్తోంది. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వస్తే జరిగే అభివృద్ధి, 4 శాతం రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలో పెట్టడం, లింగాయత్‌లకు హస్తం పార్టీ వ్యతిరేంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తుది దశ ప్రచారంలో భాజపా ప్రధాన అస్త్రాలుగా ముందుకెళ్తోంది.

మధ్యతరగతి ప్రజలే కాంగ్రెస్‌ లక్ష్యం

తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధానంగా మధ్యతరగతి వర్గంపై దృష్టి కేంద్రీకరించింది. చివరి దశ ప్రచారంలోనూ దీన్నే అస్త్రంగా మలచుకోవాలని భావిస్తోంది. మరోవైపు
కర్ణాటకలో కాంట్రాక్టర్లతో పాటు ప్రభుత్వం నుంచి నిధులు పొందే కొన్ని విభాగాల నుంచి అధికారంలో ఉన్న భాజపా నేతలు 40శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారంటూ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌.. దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారిని భాజపా తక్కువ చేసి చూస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. మోదీ-అమిత్ షా పర్యటలనకు దీటుగా తమ పార్టీకి చెందిన కీలక నేతలతో కాంగ్రెస్‌ కూడా రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఇప్పటికే రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగస్వాములుకాగా.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా ప్రచారానికి వచ్చే అవకాశముంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా చివరి దశ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ హామీలను గుప్పించే అవకాశముంది.

కింగ్‌ మేకర్‌ పాత్ర కోసం జేడీఎస్‌

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించాలని తహతహ లాడుతోంది. సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించే అవకాశాలు లేకపోయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కావాలని భావిస్తోంది. అందుకు తగినన్ని సీట్ల సాధనకు గత మూడు నెలలుగా తీవ్రంగా కృషి చేస్తోంది. తొలి విడతగా 93 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జేడీఎస్‌..ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే, పార్టీ కీలక నేత  కుమారస్వామి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. కుమారస్వామి బయటకి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ప్రచార బాధ్యతలను తన భుజాన ఎత్తుకున్నారు. తన కుమారుడు త్వరలోనే కోలుకొని, ప్రచారంలో పాల్గొంటారని ఆయన చెబుతున్నారు. పాత మైసూరు ప్రాంతంలో కుమారస్వామి ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే, ఆయన ప్రచారానికి దూరంగా ఉండటంతో ఈ ప్రాంతంలో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరోవైపు కనీసం 40 స్థానాల్లో విజయం సాధిస్తామన్న నమ్మకంతో జేడీఎస్‌ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని