Chandrababu - Modi: మోదీ అభివృద్ధి విధానాలతో ఏకీభవిస్తున్నా

దేశాభివృద్ధికి, భారతజాతి అభ్యున్నతికి ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, అమలు చేస్తున్న విధానాలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని, ప్రధాని ప్రతిపాదిస్తున్న విజన్‌-2047తో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నానని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

Updated : 26 Apr 2023 07:29 IST

విజన్‌-2047కి సంపూర్ణంగా మద్దతిస్తున్నా
రాజకీయాల్ని, అభివృద్ధిని వేర్వేరుగా చూడాలి
ప్రధాని దేశం కోసం ఆలోచిస్తున్నప్పుడు ఆయన దారిలో మనం వెళ్తే తప్పేంటి?
ప్రత్యేక హోదా, విభజన హామీల కోసమే గతంలో విభేదించా
రిపబ్లిక్‌ టీవీ సదస్సులో చంద్రబాబు వెల్లడి

ఈనాడు, అమరావతి: దేశాభివృద్ధికి, భారతజాతి అభ్యున్నతికి ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, అమలు చేస్తున్న విధానాలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని, ప్రధాని ప్రతిపాదిస్తున్న విజన్‌-2047తో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నానని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాల్ని, అభివృద్ధిని వేరువేరుగా చూడాలన్నారు. మోదీ చర్యల వల్ల భారతదేశ శక్తి సామర్థ్యాలు, బలాలు ఏమిటో యావత్‌ ప్రపంచం గుర్తించిందని ఆయన తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వంటి రాష్ట్ర ప్రజల మనోభావాలతో ముడిపడిన విభజన అంశాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడానే తప్ప వారి విధానాలతో ఎన్నడూ విభేదించలేదని ఆయన స్పష్టంచేశారు. ఆంగ్ల వార్తా ఛానల్‌ రిపబ్లిక్‌ టీవీ.. ‘టైమ్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌: ద నీడ్‌ టు కీప్‌ ఫైటింగ్‌’ అన్న అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పాత్రికేయుడు శ్రవణ్‌సేన్‌ చంద్రబాబుతో ‘టెక్నోక్రసీ ఫర్‌ డెమొక్రసీ’ అనే కాన్సెప్ట్‌పై ముఖాముఖి నిర్వహించారు. మీరు మళ్లీ భాజపాతో చేతులు కలపబోతున్నారా? అన్న ప్రశ్నకు.. ఊహాజనితమైన ప్రశ్నలకు ఇది వేదిక కాదని బదులిచ్చారు.


చంద్రబాబుతో ముఖాముఖి ఇలా సాగింది..

ప్రశ్న: కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విజన్‌ 2047 గురించి మాట్లాడుతున్న ఎన్‌డీఏ యేతర పార్టీ మీదొక్కటే. ప్రధాని ఆలోచిస్తున్న తీరులోనే మీ ఆలోచన కూడా ఉంది. దీన్నిబట్టి మీరు మళ్లీ ఎన్‌డీఏ కూటమిలోకి రావాలనుకుంటున్నారని భావించవచ్చా?

చంద్రబాబు: మీరెప్పుడూ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. దేశాభివృద్ధికి సంబంధించి ప్రధాని ఒక స్పష్టమైన ఆలోచనా విధానంలో వెళుతున్నప్పుడు.. దాని సాకారానికి మనం ఎందుకు తోడ్పడకూడదు? రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు. దేశం, సమాజం శాశ్వతం. భారత్‌ను ప్రపంచంలో నం.1గా నిలపాలన్నది నా కల, ఆకాంక్ష. ఆ కల ప్రతి ఒక్కరికీ ఉండాలి.

ప్రశ్న: మీరు జీ-20 సమావేశాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సహా వివిధ వేదికలపై ప్రధాని విధానాల్ని సమర్థిస్తూ మాట్లాడారు. ఐటీ, డిజిటల్‌ టెక్నాలజీల్లో భారత్‌కు ఎవరూ సాటిలేరని, 2047కి మనది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందనీ చెప్పారు. ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాలపై విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు, మీరు మాట్లాడుతున్న తీరుకూ పొంతన లేదన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. దీనికి మీరేమంటారు?

చంద్రబాబు: రాజకీయాలు వేరు. దేశ ప్రయోజనాలు వేరు. ప్రతి రాజకీయ పార్టీ దేశ అభివృద్ధి, జాతి భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఆ పని 25 సంవత్సరాల క్రితమే నేను చేశాను. 1995 నుంచే ఐటీ, రెండో తరం ఆర్థిక సంస్కరణల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రధాని ఆలోచన అదేవిధంగా ఉన్నప్పుడు నేనూ అలాగే ఎందుకు ఆలోచించకూడదు? ప్రధాని ప్రతిపాదిస్తున్నవాటిలో ఏవి ఆచరణ సాధ్యమో.. అవన్నీ మా ప్రాంతంలో అమలు చేస్తాం

ప్రశ్న: దేశానికి సంబంధించి ప్రధాని విజన్‌తో మీరు పూర్తిగా ఏకీభవిస్తున్నారని ఆనుకోవచ్చా?

చంద్రబాబు: ఆయన విజన్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మా ప్రజలు, నేను ఆయనతో కలసి పనిచేస్తాం. దాని వల్ల తెలుగువారికే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అమెరికాలోని భారతీయుల్లో 30-35 శాతం తెలుగువారే ఉన్నారు. అమెరికా పౌరుల తలసరి ఆదాయం 64 వేల డాలర్లయితే, అక్కడి భారతీయుల తలసరి ఆదాయం 1.24 లక్షల డాలర్లు ఉంది.

ప్రశ్న: మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివిధ దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. అక్కడి ఉత్తమ విధానాల్ని, ఆలోచనల్ని హైదరాబాద్‌లో అమలు చేశారు. అప్పటికీ, ఇప్పటికీ మన దేశాన్ని, మన అభివృద్ధి ప్రస్థానాన్ని బయటి దేశాలు చూస్తున్న తీరులో ఏమైనా మార్పు గమనించారా?

చంద్రబాబు: ఆ విషయంలో నాకు శషబిషలేమీ లేవు. ప్రధాని మోదీ మొత్తం ప్రపంచానికి భారతదేశం అంటే ఏంటో తెలియజెప్పారు. ఇండియాను బలంగా ప్రమోట్‌ చేశారు. మన బలాబలాలేంటో ప్రపంచం గుర్తించేలా చేశారు. నెట్‌వర్కింగ్‌ చాలా ముఖ్యం. మోదీ మంచి నెట్‌వర్కింగ్‌ను, మన దేశమంటే సానుకూల భావనను సృష్టించారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని అదే కోరేవాడిని. మోదీ చేసిన కృషికి ఈ దేశ పౌరుడిగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ప్రశ్న: కానీ మిగతా ప్రతిపక్షాలు మీలా మాట్లాడటం లేదు. ఒక దశలో మీరు భాజపాయేతర పార్టీల్ని ఒక తాటిపైకి తేవాలని వారు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ల ఆలోచనలకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో వాళ్లకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?

చంద్రబాబు: నేను అప్పట్లో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించలేదు. రాష్ట్ర విభజన అనంతరం ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా వంటి అంశాల కోసం పోరాడాను.

ప్రశ్న: మీ మాటల్ని బట్టి వ్యక్తిగతంగా ప్రధాని మోదీ అంటే మీకు చాలా అభిమానం, ఇష్టమని తెలుస్తోంది. గతంలో ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చినందుకు చింతిస్తున్నారా? అప్పుడు మీరు వెళ్లిన మార్గం సరైంది కాదని అనుకుంటున్నారా?

చంద్రబాబు: నా లక్ష్యం అధికారం కాదు. దాని కోసం పనిచేయడం లేదు. అప్పట్లో ప్రధాని వాజ్‌పేయీ.. తెదేపాని తమ ప్రభుత్వంలో చేరాలని, 7-8 మంత్రిపదవులు ఇస్తామని చెప్పారు. నేను అంగీకరించలేదు. పదవులు అక్కర్లేదని దేశాభివృద్ధి కోసం వారితో కలసి పనిచేస్తానని చెప్పాను. ఎవరైనా అభివృద్ధి కోసం పనిచేస్తున్నప్పుడు వారితో కలసి ముందుకు వెళ్లాలని అనుకుంటాను.

ప్రశ్న: దేశాభివృద్ధి కోసం భాజపాతో మీరు మళ్లీ చేతులు కలుపుతారా?

చంద్రబాబు: ఊహాజనితమైన ప్రశ్నలపై స్పందించను. ఇది దానికి తగిన వేదిక కాదు.

ప్రశ్న: మీ పార్టీ, భాజపా మేనిఫెస్టోల్లోని సారాంశం ఒకేలా ఉంటాయి. మీ రెండు పార్టీలు దేశం కోసమే పనిచేస్తున్నప్పుడు.. మీరు భాజపాతో కలసి అధికారంలోకి ఎందుకు రాకూడదు. పోర్ట్‌బ్లెయిర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాజపాతో కలసి మేయర్‌ స్థానాన్ని దక్కించుకున్నారు కదా? ఏపీలో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాక్టర్‌ కూడా ఉంది.. భాజపాతో కలసి పనిచేసేందుకు మీరు సానుకూలంగానే ఉన్నారా?

చంద్రబాబు: నా ఎజెండా నాకుంది. భారత్‌ను ప్రపంచంలో నం.1గా చూడాలన్నది నా లక్ష్యం. భారతీయుల్ని, వారిలో ముఖ్యంగా తెలుగువారిని సంపదపరంగా యూదులకంటే మెరుగైన స్థానంలో నిలపాలన్నది నా ఆశయం. ప్రస్తుతం తలసరి ఆదాయంపరంగా యూదులకంటే, భారతీయులే ముందు వరుసలో ఉన్నా.. యూదుల దగ్గర సంపద ఎక్కువగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని సమాజంగా చూడాలి. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం 2047కి మధ్యతరగతి/ ఎగువ మధ్యతరగతి స్థాయికి చేరుకోవాలి. సంక్షేమం, అభివృద్ధి ద్వారానే అది సాధ్యం.

ప్రశ్న: అంటే భాజపాతో కూటమి ఆలోచనకు మీరు వ్యతిరేకం కాదనే కదా?

చంద్రబాబు: ప్రధాని తీసుకుంటున్న, అమలు చేస్తున్న సానుకూల నిర్ణయాలు, విధానాలన్నిటినీ నేను సమర్థిస్తున్నాను. భారతదేశ అభివృద్ధి ప్రస్థానానికి అందరూ భుజం కాయాలి.

2019లో మీరు ఎన్డీఏ యేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చి ఒక కూటమి ఏర్పాటుకు ప్రయత్నించారు. ఇప్పుడూ మీరు ఆ ఆలోచనకు వ్యతిరేకం కాదని అనుకోవచ్చా?

చంద్రబాబు: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న సానుకూల చర్యలన్నిటికీ నేను మద్దతిస్తున్నప్పుడు.. ఆయన నిర్ణయాలు, ఆలోచనలతో ఏకీభవించినట్టే కదా? మహోన్నతమైన ఈ దేశ అభివృద్ధికి అందరం కలసి పనిచేయాలి.

అలాంటప్పుడు ఎన్డీయే కూటమిలో చేరేందుకు మీరు వ్యతిరేకం కాదని అనుకోవచ్చా?

చంద్రబాబు: అన్నీ కాలమే నిర్ణయిస్తుంది.

ప్రశ్న: మీరు ప్రధాని నిర్ణయాల్ని, చర్యల్ని బహిరంగంగానే సమర్థిస్తున్నారు. ఆయన చెబుతున్న విజన్‌-2047కి మద్దతిచ్చారు. మీరు దార్శనికత కలిగిన నాయకుడు. దేశానికిప్పుడు దార్శనికులు కావాలి. ఇప్పటికే ఒక దార్శనిక నేత ఉన్నారు. ఆయనతో మరొక దార్శనిక నేత చేతులు కలిపితే మంచిదేగా?

చంద్రబాబు: ప్రధాని చర్యలు, నిర్ణయాలతో నేను ఏకీభవిస్తున్నాను. సంపూర్ణ మద్దతిస్తున్నాను. నాకు రాజకీయాలకంటే దేశం ముఖ్యం.


సైబర్‌బాబు ఆఫ్‌ హైదరాబాద్‌

చంద్రబాబుపై పాత్రికేయుడు శ్రవణ్‌సేన్‌, యాంకర్‌లు ప్రశంసలు కురిపించారు. ఆయనను ఒకప్పుడు ‘సైబర్‌బాబు ఆఫ్‌ హైదరాబాద్‌’ అని పిలిచేవారని, హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా చేయాలని 1997లోనే కలలుగని, 2000 సంవత్సరం నాటికి దాన్ని సాకారం చేసి చూపించిన ఘనత ఆయనకు దక్కుతుందని తెలిపారు. ఈ సహస్రాబ్ది ప్రారంభంలో దావోస్‌కు చెందిన వరల్డ్‌లింక్‌ మ్యాగజైన్‌ సంస్థ ఎంపిక చేసిన ‘డ్రీమ్‌ క్యాబినెట్‌ ఆఫ్‌ పొలిటికల్‌ లీడర్స్‌’లో చంద్రబాబుకు చోటు కల్పించిందన్నారు. టెక్నాలజీని, అభివృద్ధిని సమ్మిళితం చేసి సత్ఫలితాలు సాధించిన మార్గదర్శిగా ఆయనను అభివర్ణించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు