Karnataka Elections: కర్ణాటకలో గెలుపెవరిది?

కన్నడనాట రాజకీయ ఆనవాయితీ పునరావృతం అవుతుందా, లేదా ఈసారి ఓటర్లు దానికి భిన్నంగా అడుగులు వేశారా? అనేది మరికొన్ని గంటల్లో తేలబోతోంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి.

Updated : 13 May 2023 07:04 IST

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు పూర్తి
ఆధిక్యం తమదేనంటున్న పార్టీలు
ఆనవాయితీ కొనసాగేదీ, లేనిదీ తేలేది నేడే

ఈనాడు, బెంగళూరు: కన్నడనాట రాజకీయ ఆనవాయితీ పునరావృతం అవుతుందా, లేదా ఈసారి ఓటర్లు దానికి భిన్నంగా అడుగులు వేశారా? అనేది మరికొన్ని గంటల్లో తేలబోతోంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించేలా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ప్రణాళిక రూపొందించారు. గత 38 ఏళ్లలో ఏ పార్టీ వరసగా రెండోసారి అధికారంలోకి రాకపోవడం కర్ణాటకలో ఆనవాయితీగా ఉంది. ఈసారి కాంగ్రెస్‌కే స్వల్పంగా మొగ్గు ఉంటుందని పలు ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పడం, జేడీఎస్‌ది కీలకపాత్ర అవుతుందని అంచనా వేయడంతో పార్టీల నేతలు, ప్రజల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. 224 నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో 73.19 శాతం రికార్డుస్థాయి పోలింగ్‌ నమోదయ్యింది. దీంతో ఏదోఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందన్న అంచనా మొదలైంది. మధ్యాహ్నం నాటికి ఫలితాల్లో స్పష్టత రావచ్చని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఇలా..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 104 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కాంగ్రెస్‌ 80, జేడీఎస్‌ 37 స్థానాల్లో నెగ్గాయి. ఎవరూ స్పష్టమైన ఆధిక్యం పొందలేకపోయారు. నాటకీయ పరిణామాల్లో తొలుత యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేశారు. అది మూడురోజుల ముచ్చటగానే మిగిలింది. దాంతో ఆయన వైదొలగడం, కాంగ్రెస్‌-జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరసగా జరిగాయి. కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం 14 నెలలే కొనసాగింది. కొందరు ఎమ్మెల్యేలు భాజపావైపు చూడడంతో ఆ పార్టీ బలం 116కి చేరి, కమలనాథుల ప్రభుత్వం ఏర్పడింది.

పైకి ధీమా.. లోలోపల గుబులు

అధికారం తమకే దక్కుతుందని భాజపా, కాంగ్రెస్‌, జేడీఎస్‌లు బయటకు ధీమా కనపరుస్తున్నా లోలోపల ఎవరి ఆందోళన వారికి ఉంది. ఆధిక్యం రాకపోయినా ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్‌ బి) తమకు ఉందని భాజపా చెబుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలు రాకపోతే పార్టీ అధినాయకత్వం మార్గనిర్దేశంలో తమ ఆపరేషన్‌ ప్రారంభిస్తామని రాష్ట్రమంత్రి ఆర్‌.అశోక చేసిన ప్రకటన గమనార్హం. పార్టీ పార్లమెంటరీ మండలి సభ్యుడు బి.ఎస్‌.యడియూరప్ప నివాసంలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైతో పలువురు మంత్రులు శుక్రవారం సమావేశమయ్యారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలాఉన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో చర్చించాల్సిన అవసరం తమకు రాబోదని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

విజేతలు బెంగళూరుకు రావాలని కాంగ్రెస్‌ పిలుపు

పార్టీ విజేతలంతా బెంగళూరుకు వచ్చేయాలని కాంగ్రెస్‌ సూచించింది. ‘ఆపరేషన్‌ కమల్‌’లో వారెవరూ చిక్కుకోకూడదని ఈ మేరకు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 141 స్థానాలతో సొంతంగా తాము అధికారంలోకి వస్తామని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ ఘంటాపథంగా చెబుతున్నారు. శిబిర రాజకీయాలకు మళ్లాల్సిన అవసరమే రాదని చెప్పారు. ఎన్ని స్థానాలొచ్చినా అధికారాన్ని ఏర్పాటు చేస్తామన్న భాజపా వ్యాఖ్యలతో పరాజయాన్ని ఆ పార్టీ అంగీకరించినట్లేనని డీకే శివకుమార్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో శివకుమార్‌ ప్రత్యేకంగా సమావేశమై రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఎవరితో కలవాలో తర్వాత ప్రకటిస్తాం: జేడీఎస్‌

జేడీఎస్‌ హంగ్‌ అసెంబ్లీపై ఆశలు పెట్టుకుంది. మద్దతు ప్రకటించాలంటే సీఎం పదవి కోసం ఆ పార్టీ డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నా సరైన సమయంలో దానిపై ప్రకటన చేస్తామని ఆ పార్టీ నేత తన్వీర్‌ అహ్మద్‌ చెప్పారు. మాజీ ప్రధాని దేవెగౌడ ఆకాంక్ష మేరకు కాంగ్రెస్‌కే జేడీఎస్‌ మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. సింగపూర్‌ పర్యటన మాటున భాజపా కేంద్ర నాయకులతో కుమారస్వామి చర్చిస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. దానికి తగ్గరీతిలోనే.. ఎన్నికల తర్వాత పొత్తులకు సిద్ధమని ఆయన ప్రకటించారు. మంత్రి ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ హంగ్‌ ఫలితం వచ్చినా కప్పు మాత్రం భాజపాదేననడం- జేడీఎస్‌తో పొత్తులకు సిద్ధమన్న వాదనకు మరింత బలాన్నిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని