రాజస్థాన్‌ ప్రజలు మోదీకి బుద్ధి చెబుతారు

గత ప్రభుత్వాలపై శాపనార్థాలు పెట్టే విధానాన్ని రాజస్థాన్‌లోనూ ప్రధాని మోదీ అవలంబిస్తున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది.

Updated : 01 Jun 2023 05:32 IST

ప్రధానిపై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్‌

దిల్లీ: గత ప్రభుత్వాలపై శాపనార్థాలు పెట్టే విధానాన్ని రాజస్థాన్‌లోనూ ప్రధాని మోదీ అవలంబిస్తున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. కర్ణాటక ప్రజల్లాగే రాజస్థాన్‌ ఓటర్లూ మోదీకి బుద్ధి చెబుతారని పేర్కొంది. రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తన 50 ఏళ్ల పాలనలో పేదలను మోసం చేసిందని ఆరోపించారు. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా బుధవారం దిల్లీలో మాట్లాడుతూ ఈ మేరకు ప్రతి విమర్శలు గుప్పించారు.

* ‘బేేటీ బచావో, బేటీ పడావో’ నినాదాన్ని ‘భాజపా నేతల వేధింపుల నుంచి బేటీలను రక్షించండి’ అని మార్చాలని కాంగ్రెస్‌ నేతలు దీపేందర్‌ హుడా, విజేందర్‌ సింగ్‌ ఎద్దేవా చేశారు. రెజ్లర్లు పతకాలు గెలిచినప్పుడు వారితో ఫొటోలు దిగడానికి ప్రధాని ఆరాటపడ్డారని.. కానీ ఇప్పుడు ఆ పతకాలను గంగా నదిలో కలిపేస్తామంటే  స్పందించడం లేదని విమర్శించారు. 

* దిల్లీలో పరిపాలన సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వైఖరిని కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ తప్పుపట్టారు. పరిపాలన సేవలను మించిన అధికారాలను కేజ్రీవాల్‌ కోరుకుంటున్నారని, తద్వారా తన ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై దర్యాప్తును అడ్డుకోవడమే ఆయన అసలు ఉద్దేశమని విమర్శించారు.


మీడియా ప్రశ్న.. కేంద్ర మంత్రి పరుగులు

దిల్లీ: రెజ్లర్ల నిరసన గురించి కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా ఆమె పరుగులు పెట్టారు. సంబంధిత వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్రంలో భాజపా 9 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రిని విలేకరులు చుట్టుముట్టారు. ‘రెజ్లర్ల ఆందోళనపై మీ స్పందన ఏంటి’ అని ఆమెను ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మీనాక్షి లేఖి వెళ్తుండగా.. విలేకరులు ఆమెను అనుసరించారు. అదే ప్రశ్నను మళ్లీ అడగ్గా.. ‘న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది’ అని చెబుతూ ఆమె పరుగెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని