ఎన్నికల వ్యూహంపై చర్చిద్దాం రండి..

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు దిల్లీ రావాలని రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులకు అధిష్ఠానం వర్తమానం పంపింది.

Updated : 07 Jun 2023 06:09 IST

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అధిష్ఠానం పిలుపు
11న లేదా ఆ తరువాత సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు దిల్లీ రావాలని రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులకు అధిష్ఠానం వర్తమానం పంపింది. ఈ నెల 11న లేదా ఆ తరవాత దిల్లీలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ భేటీ గత నెల 24నే జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. ప్రస్తుతం రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ఇతర అగ్రనేతలు తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు, మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అనుబంధ విభాగాల ఛైర్మన్లు, ఇతర నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అభ్యర్థుల ఎంపిక విధానాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన ప్రజాసంక్షేమ పథకాలు తదితర అంశాలపై దిల్లీలో దిశా నిర్దేశం చేస్తారని సమాచారం.

దశాబ్ది ఉత్సవాలేవీ?

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహిస్తోంది.  కాంగ్రెస్‌ తరఫున కూడా భారీగా నిర్వహించనున్నట్లు తొలుత చెప్పారు. రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీ అని ప్రజలకు వివరించాలని అనుకున్నారు. అయితే ఈ ఉత్సవాలను అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించడం లేదని,  ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదని, రాష్ట్ర పార్టీ సైతం పర్యవేక్షించడంలేదని ఓ సీనియర్‌ నేత ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

నేటి నుంచి జాతీయ యువజన కాంగ్రెస్‌ సమావేశాలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో ఈ నెల 7, 8, 9 తేదీల్లో జాతీయ యువజన కాంగ్రెస్‌ సమీక్ష సమావేశాలు జరుగుతాయని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌, 33 రాష్ట్రాల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరవుతారని పేర్కొన్నారు. తెలంగాణలో జాతీయస్థాయి యువజన కాంగ్రెస్‌ సమావేశాలు జరగడం ఇదే మొదటిసారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని