భాజపాకు దగ్గరవుతున్న జేడీఎస్‌?

ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్‌ సెక్యులర్‌(జేడీఎస్‌) పార్టీ ఆశించిన సీట్లను పొందలేకపోయింది. ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌ మేకర్‌గా వ్యవహరిద్దామనుకున్న ఆ పార్టీ ఆశలు ఆవిరయ్యాయి.

Updated : 08 Jun 2023 06:24 IST

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌పై దేవేగౌడ ప్రశంసలు
భాజపాతో సంబంధాలు లేని పార్టీ లేదంటూ వ్యాఖ్య

  దిల్లీ: ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్‌ సెక్యులర్‌(జేడీఎస్‌) పార్టీ ఆశించిన సీట్లను పొందలేకపోయింది. ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌ మేకర్‌గా వ్యవహరిద్దామనుకున్న ఆ పార్టీ ఆశలు ఆవిరయ్యాయి. 224 అసెంబ్లీ స్థానాలకుగానూ 19 మాత్రమే దక్కించుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ పార్టీ ఇప్పుడు భాజపా వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవేగౌడ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

రాజీనామా డిమాండ్‌ తెలివైన పనికాదు

ఒడిశాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్రంగా ధ్వంసమైన పట్టాలు పునరుద్ధరించిన తర్వాత మళ్లీ రైళ్ల రాకపోకలు సాగే వరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అక్కడే ఉండి అన్ని పనులు పర్యవేక్షించారు. దీనిపై దేవేగౌడ స్పందిస్తూ.. ‘ఈ క్లిష్టసమయంలో ఆయన నిర్విరామంగా పనిచేశారు. గొప్ప పనితీరు చూపారు. ఈ సమయంలో ఆయన రాజీనామా కోరడం తెలివైన పనికాదు’అని రైల్వే మంత్రి పనితీరును ఇటీవల మెచ్చుకున్నారు.

ప్రతిపక్షాల తీరుపై విమర్శలు

అలాగే దేశంలోని ప్రతిపక్షాల తీరును విమర్శించారు.‘ఈ దేశ రాజకీయాల గురించి విశ్లేషించగలను. కానీ ఏం లాభం? భాజపాతో సంబంధాలు లేని ఒక్క పార్టీని చూపించండి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉన్నాయి. అలాలేని పార్టీని చూపించండి. అప్పడు నేను సమాధానం చెప్తా’అని అన్నారు. భాజపాకు వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీలను ఒక్క దగ్గరకు చేర్చేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ చేస్తోన్న ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే.. భాజపాకు జేడీఎస్‌ దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. గత నెల దేవేగౌడ పుట్టినరోజుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం.

జేడీఎస్‌తో గతంలో భాజపాకు చేదు అనుభవమే

ఇదిలా ఉంటే.. 2006లో కర్ణాటకలో భాజపా, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా, బీఎస్‌ యడియూరప్ప ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే పవర్‌ షేరింగ్‌ ఫార్ములా విఫలం కావడంతో 20 నెలల్లో ఆ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. భాజపాకు అధికారాన్ని బదిలీ చేయడానికి జేడీఎస్‌ నిరాకరించడమే అందుకు కారణం.

కార్యకర్తలతో నడ్డా ‘టిఫిన్‌ భేటీ’

లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే క్రమంలో భాగంగా కార్యకర్తలతో బుధవారం భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ‘టిఫిన్‌ భేటీ’ పేరిట జరిగిన ఈ సమావేశంలో పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శ్రేణులకు నడ్డా దిశా నిర్దేశం చేశారని నోయిడా మహానగర్‌ అధ్యక్షుడు మనోజ్‌ గుప్తా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు భూపేంద్ర చౌధరి, ఉపాధ్యక్షుడు పంకజ్‌సింగ్‌ తదితరులు హాజరయ్యారు.


ఎన్‌డీయే విస్తరణ యోచనలో భాజపా

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం భాజపా రాజకీయ వ్యూహాలపై తీవ్రంగానే ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాల సాధనపై మేధోమథనం ప్రారంభించింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌, తెలంగాణల వంటి రాష్ట్రాల్లో సమస్యాత్మకంగా మారిన ముఠాతత్వాన్ని రూపుమాపి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తద్వారా ఆయా రాష్ట్రాల్లో తిరుగులేని ఫలితాలు సాధించాలని కసరత్తు చేస్తోంది. మరోపక్క కేంద్రంలో మూడోసారీ అధికారం చేపట్టాలని దృఢంగా భావిస్తున్న కాషాయ దళం ఎన్‌డీయే కూటమి విస్తరణపైనా దృష్టి సారించింది. ప్రతిపక్షాలన్నీ ఐక్యతా రాగం తీసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో ఎన్‌డీయే బలోపేతం ఆవశ్యకతపైనా పార్టీ అధినేతలు   సమాలోచనలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఎన్‌డీయే నుంచి శిరోమణి అకాలీదళ్‌, జనతాదళ్‌ (యూ), శివసేన, తెదేపా వంటి బలమైన పార్టీలు వైదొలిగాయి. ఈ క్రమంలో కూటమి బలోపేతం లోక్‌సభ ఎన్నికల ఫలితాలను మెరుగు పరుస్తుందని భాజపా భావిస్తోంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని