‘శిందే సేన’లో అలజడి!

మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ అజిత్‌ పవార్‌ వర్గం చేరడం శివసేనలో (శిందే వర్గం) అలజడి రేపింది. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.

Updated : 07 Jul 2023 06:24 IST

ప్రభుత్వంలో ఎన్సీపీ చేరికపై   ఎమ్మెల్యేల్లో అసంతృప్తి?
ఆందోళన వద్దని సీఎం హామీ
దిల్లీలో శరద్‌ పవార్‌ పార్టీ భేటీ
తిరుగుబాటు నేతల బహిష్కరణ
ఎన్సీపీ అధినేతను కలిసి  సంఘీభావం తెలిపిన రాహుల్‌

ముంబయి, దిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ అజిత్‌ పవార్‌ వర్గం చేరడం శివసేనలో (శిందే వర్గం) అలజడి రేపింది. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. అజిత్‌ చేరికతో శిందే వర్గంలో తిరుగుబాటు మొదలైందని శివసేన (ఉద్ధవ్‌ వర్గం) పేర్కొనడం మరింత ఆజ్యం పోసింది. శిందేసహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఆ తర్వాత అజిత్‌ పవార్‌ సీఎం అవుతారని ఠాక్రే వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వారితో సమావేశమయ్యారు. ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని స్పష్టం చేశారు.

శివసేన ప్రజాప్రతినిధుల సమావేశంలో కొంత మంది అజిత్‌ పవార్‌ రాకపై అనుమానాలను వ్యక్తం చేశారు. పలు అంశాలపై వారి మధ్య చర్చలు జరిగాయి. అజిత్‌ వర్గం రాకతో భాజపా, శివసేనలో మంత్రి పదవులను ఆశిస్తున్న నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఈ విషయం మీకు తెలుసా అని కూడా శిందేను ఓ ఎంపీ ప్రశ్నించారు. అజిత్‌ వర్గం రావడంవల్ల మేలే జరుగుతుందని శిందే చెప్పినట్లు తెలిసింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారని ఓ ఎంపీ తెలిపారు.

92 ఏళ్లు వచ్చినా పని చేస్తా: శరద్‌ పవార్‌

పార్టీ పేరు, గుర్తుపై తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ దిల్లీలో వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. పీసీ చాకో, జితేంద్ర అహ్వాడ్‌, ఫౌజియా ఖాన్‌, వందనా చవాన్‌ సహా 13 మంది నేతలు దీనికి హాజరయ్యారు. పార్టీకి తానే అధ్యక్షుడినని శరద్‌ పవార్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. 82 కాదు 92 ఏళ్లు వచ్చినా పార్టీ కోసం పని చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. రిటైర్‌మెంట్‌ ప్రకటించాలని పరోక్షంగా బుధవారం అజిత్‌ చురకలు వేయడంపై ఆయన స్పందించారు. పార్టీ కోసం చేసే పనిని ఆపేది లేదని తెలిపారు. ఎన్డీయేతో కలిసిన ప్రఫుల్‌ పటేల్‌, తత్కారేసహా 11 మందిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు పార్టీ నేత పీసీ చాకో తెలిపారు. భాజపా అప్రజాస్వామిక చర్యను సమావేశం ఖండించినట్లు తెలిపారు.

పవార్‌ను కలిసిన రాహుల్‌

దిల్లీలో గురువారం శరద్‌ పవార్‌ను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కలిశారు. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. పవార్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్‌ ఫోన్‌ చేసి మద్దతు తెలిపారు.

‘42 మంది సంతకాలు చేశారు’

అజిత్‌ పవార్‌కు మద్దతుగా 42 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ తెలిపారు. శిందే వర్గం నుంచి 17-18 మంది ఎమ్మెల్యేలు వెనక్కి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని శివసేన (ఉద్ధవ్‌) నేత సంజయ్‌రౌత్‌ తెలిపారు. అజిత్‌ చేరికతో శిందే వర్గ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు మొదలైందని ఎంపీ వినాయక్‌ రౌత్‌ పేర్కొన్నారు.


కట్టప్ప పోస్టర్లు

జిత్‌ పవార్‌ తిరుగుబాటును ఉద్దేశిస్తూ కొన్ని పోస్టర్లు వెలిశాయి. వాటిలో జూనియర్‌ పవార్‌ను ద్రోహి అని అభివర్ణించారు. ఇలాంటి వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని విమర్శించారు. దిల్లీలోని శరద్‌ పవార్‌ ఇంటి వెలుపల ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ‘మన మధ్యలోనే ఉన్న ద్రోహులను దేశం మొత్తం చూస్తోంది. వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరు’ అని సీనియర్‌ పవార్‌ వర్గం విమర్శలు గుప్పించింది. అలాగే పోస్టర్లపై తెలుగు బ్లాక్‌ బస్టర్‌ ‘బాహుబలి’ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ప్రచురించింది. బాహుబలిని కట్టప్ప వెనక నుంచి కత్తితో పొడిచే దృశ్యమది. కట్టప్ప స్థానంలో అజిత్‌ పవార్‌, బాహుబలి స్థానంలో శరద్‌ పవార్‌ను ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని