Trinamool Congress: వైకాపాలాంటి పార్టీలు ఎగతాళి చేసినా ముందుకే!

‘మేం ఇండియా తరఫున అవిశ్వాస తీర్మానం పెట్టింది ఎవరినో దించడానికి కాదు. ఆరు అడుగుల లోతున పాతిపెట్టిన భారతీయ సిద్ధాంతాలు, సమానత్వం, సెక్యులరిజం లాంటి వాటిని వెలికి తీయడానికి.

Updated : 11 Aug 2023 12:15 IST

తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా స్పష్టీకరణ

దిల్లీ: ‘మేం ఇండియా తరఫున అవిశ్వాస తీర్మానం పెట్టింది ఎవరినో దించడానికి కాదు. ఆరు అడుగుల లోతున పాతిపెట్టిన భారతీయ సిద్ధాంతాలు, సమానత్వం, సెక్యులరిజం లాంటి వాటిని వెలికి తీయడానికి. అధికార పార్టీ సభ్యులతోపాటు బిజూ జనతాదళ్‌, వైకాపా లాంటి మిత్రులు ప్రభుత్వాన్ని పడగొట్టలేరని మమ్మల్ని ఎగతాళి చేయొచ్చు. మాకు సంఖ్యాబలం లేకపోవచ్చు. అయినా ఇండియాపై విశ్వాసం ప్రదర్శించడానికి అవిశ్వాసం పెట్టాం’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఆమె మాట్లాడారు. మణిపుర్‌ ఘటనను గతంలోని వాటితో పోలుస్తూ ప్రభుత్వాలు మౌనంతో కప్పేశాయని విమర్శించారు. పార్లమెంటులో తరచూ నోరు మూసుకోండనే ప్రధాని ఇప్పుడు మణిపుర్‌ గవర్నర్‌నూ అలాగే ఆదేశించారని ధ్వజమెత్తారు. మంగళ, బుధవారాల్లో సభ్యుల మాటలను వినడానికి సభకు రాని ప్రధాని తన మాటలను సభ్యులకు వినిపించేందుకు గురువారం వచ్చారని ఎద్దేవా చేశారు. ఆమె మాట్లాడుతుండగా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌లలో అత్యాచారాల సంగతేంటని అధికార పక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో మొయిత్రా హరియాణాను ప్రస్తావించారు. అయితే వీటన్నింటితో పోలిస్తే మణిపుర్‌ సమస్య విభిన్నమైనదని ఆమె స్పష్టం చేశారు. ‘ప్రధాన మంత్రి గారూ.. మీరు వింటున్నారా.. మణిపుర్‌లో పాలనా వ్యవస్థను మార్చండి. పార్టీలు కలిసి పనిచేయడానికి అవకాశమివ్వండి’ అని విజ్ఞప్తి చేశారు. ప్రధానిపై భారత్‌ విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. 37శాతం ఓట్లు వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చి బెదిరిస్తుంటే మిగిలిన 63శాతం మంది ఓట్లున్న పార్టీలుగా భయపడబోమని స్పష్టం చేశారు. ఈసారి అవకాశాన్ని చేజార్చుకోబోమని, గెలిచి తీరుతామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు