జోరందుకోనున్న ఫిరాయింపులు

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. ఉన్న పార్టీలో టికెట్‌ వచ్చే అవకాశం లేకపోతే ఇంకో పార్టీలో చేరి పొందే ప్రయత్నం కొందరు చేస్తుంటే, గట్టిగా టికెట్‌ కోసం ప్రయత్నిస్తే ఏదో ఒక పదవి రాకపోతుందా అనుకొంటున్న వారు కొందరు.

Updated : 18 Aug 2023 06:12 IST

టికెట్‌ కోసం గోడ దూకేందుకు సిద్ధం
బలమైన అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీల యత్నం
ద్వితీయశ్రేణి నాయకులపైనా దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. ఉన్న పార్టీలో టికెట్‌ వచ్చే అవకాశం లేకపోతే ఇంకో పార్టీలో చేరి పొందే ప్రయత్నం కొందరు చేస్తుంటే, గట్టిగా టికెట్‌ కోసం ప్రయత్నిస్తే ఏదో ఒక పదవి రాకపోతుందా అనుకొంటున్న వారు కొందరు. ఇలా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అధికార భారాస సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువమందికి మళ్లీ టికెట్లు ఇచ్చే ఆలోచనతో ఉన్నట్లు ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. అయినా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడం, తమకు టికెట్‌ ఇవ్వాలని కోరడం, ఫలానా అభ్యర్థికి  టికెట్‌ ఇస్తే తాము పనిచేయబోమని బెదిరించడం వంటి ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో సమస్యను పరిష్కరించేందుకు భారాస ప్రయత్నిస్తోంది. అవసరమైనచోట బలమైన అభ్యర్థులను ఇతర పార్టీల నుంచి ఆకర్షిస్తోంది. కొన్నాళ్ల కిందట భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి భారాసలో చేరగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం నియోజకవర్గ నాయకుడు తెల్లం వెంకట్రావు తాజాగా మళ్లీ భారాస గూటికి చేరారు. భద్రాచలం నుంచి టికెట్‌ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈయన చేరినట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా భారాసలో చేరతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. భారాస మొదటి జాబితా విడుదల చేసే లోగానే ఈయన చేరే అవకాశం ఉందని అంటున్నా.. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుందని సమాచారం. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో భాజపా ఇన్‌ఛార్జిగా ఉన్న వినయ్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఈయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. ఆర్మూర్‌ నుంచి ఈయన గట్టి అభ్యర్థి అవుతారని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి,  గద్వాల జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సరిత, వనపర్తి నియోజకవర్గంలో ఎంపీపీ మేఘారెడ్డి ఇటీవల భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి కొందరు నాయకులు గురువారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన పలువురు నియోజకవర్గ లేదా ద్వితీయశ్రేణి నాయకులు అనేకచోట్ల ఇప్పటికే భారాసలో చేరారు.

నియోజకవర్గంలోని ప్రత్యర్థి పార్టీలో ఎంతోకొంత బలం ఉన్న నాయకులను చేర్చుకుంటే ఆ పార్టీలను దెబ్బతీయవచ్చన్న అభిప్రాయంతో అధికార పార్టీ ఉంది. ఆయా నాయకులు కొన్నిచోట్ల ఎమ్మెల్యేలతో విభేదాల కారణంగా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తుంటే, మరికొందరు వేరే పార్టీలో టికెట్‌ గ్యారంటీగా వస్తుందని ఆశించి వెళ్తున్నారు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో నియోజకవర్గ స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకుల ఫిరాయింపులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాకు టికెట్‌ ఇస్తే రూ.20 కోట్లు పెట్టుకుంటా అని ఒకరొస్తే, రూ.30 కోట్లయినా సరే అంటూ ఇంకొకరు.. ఇలా  భారీగా ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనకాడకుండా టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రియల్‌ ఎస్టేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలు, మద్యం తదితర వ్యాపారాల్లో ఉన్నవారు టికెట్‌ కోసం ఆరాటపడుతున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్‌, పురపాలకసంస్థల ఛైర్మన్లుగా ఉన్నవారు కూడా తదుపరి గమ్యం శాసనసభ అంటూ హోరాహోరీ ప్రయత్నం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని