BRS: వామపక్షాలతో పొత్తు లేనట్లే!

వామపక్షాలు కోరుతున్న స్థానాలకు కూడా భారాస అభ్యర్థులను ప్రకటించడంతో వాటితో ఎన్నికల అవగాహనకు అవకాశం లేనట్లేనని స్పష్టమవుతోంది.

Updated : 22 Aug 2023 09:05 IST

నేడు సీపీఎం, సీపీఐ ఉమ్మడి సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: వామపక్షాలు కోరుతున్న స్థానాలకు కూడా భారాస అభ్యర్థులను ప్రకటించడంతో వాటితో ఎన్నికల అవగాహనకు అవకాశం లేనట్లేనని స్పష్టమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు భారాసకు మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి కృషి చేశాయి. అప్పటి నుంచి భారాస, వామపక్షాల మధ్య మైత్రి ప్రారంభమైంది. కానీ కేసీఆర్‌ భారాస అభ్యర్థుల జాబితాను ప్రకటించేయడంతో వామపక్షాలు కంగుతిన్నాయి. సీపీఐ, సీపీఎంలు మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లో ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటుపై కొద్దిరోజుల క్రితం భారాస, వామపక్ష నేతల మధ్య చర్చలు జరిగాయి. సీపీఎం, సీపీఐలకు ఒక్కో ఎమ్మెల్యే స్థానం, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని భారాస ప్రతిపాదించింది. చెరి 3 అసెంబ్లీ స్థానాలకు పట్టుబట్టిన వామపక్షాలు.. కనీసం రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలైనా ఇవ్వాలని అడిగాయి. లేదంటే ఎమ్మెల్సీ సీట్లకు బదులు 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ కోరింది. సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు ఇస్తామని భారాస ప్రతిపాదించింది. వీటికి అదనంగా పాలేరు, మిర్యాలగూడెంలో ఏదో ఒకటి ఇవ్వాలని సీపీఎం.. కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్‌లో 1 ఇవ్వాలని సీపీఐ కోరాయి. కానీ ఒక్కో అసెంబ్లీ స్థానం, రెండేసి ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే ఇస్తామని భారాస పేర్కొనడంతో చర్చలు ఫలించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు