‘కాల్చి పడేస్తా’ వ్యాఖ్యలు ఈసీ దృష్టికి

నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీచేశారు.

Published : 03 Sep 2023 03:43 IST

ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డిలపై కాంగ్రెస్‌ ఫిర్యాదులు
చర్యలు తీసుకోవాలని డీజీపీకి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీచేశారు. ‘భారాస జోలికొస్తే కాల్చి పడేస్తా’ అంటూ గత ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లిలో ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ సభ్యుడు సి.నిరంజన్‌, కన్వీనర్‌ పి.రాజేశ్‌కుమార్‌లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ను అందజేశారు. అలానే రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ సూర్యాపేట కౌన్సిలర్‌ రేణుక మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీకి తాము టికెట్‌ ఆశించడంతో.. ఆగ్రహించిన మంత్రి తన భర్త, మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌ వట్టే జానయ్యపై కేసులు నమోదు చేయించారని రేణుక ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఆ ఫిర్యాదులపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవడంతోపాటు ఎన్నికల సంఘానికి తెలియజేయాలని డీజీపీ, నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాల ఎన్నికల అధికారులకు వికాస్‌రాజ్‌ స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు