MP Raghurama: రాష్ట్రంలో త్వరలో జైలర్‌ సినిమా సీన్‌!

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిజ స్వరూపం ఏమిటో తండ్రి లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిసిపోయి ఉంటుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 08 Nov 2023 07:30 IST

జగన్‌ నిజస్వరూపం ప్రధానికి తెలిసి ఉంటుంది
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు

ఈనాడు, దిల్లీ: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిజ స్వరూపం ఏమిటో తండ్రి లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిసిపోయి ఉంటుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రజినీకాంత్‌ నటించిన ‘జైలర్‌’ సినిమా సీన్‌ త్వరలో రాష్ట్రంలో కనిపించవచ్చని పేర్కొన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జైలర్‌ చిత్రంలో రజినీకాంత్‌ పోలీస్‌ ఉన్నతాధికారిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న కుమారుడు దొంగతనాలు చేస్తున్న విషయం తెలిసి అతన్ని చంపాలని ఆదేశిస్తారని.. రాష్ట్రంలోనూ రేపు అటువంటి దృశ్యమే పునరావృతం కావచ్చని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు జగన్‌ తన పేరునో లేదా తన తండ్రి వై.ఎస్‌. పేరునో పెట్టుకోవడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. పీఎం కిసాన్‌ పథకానికి వైఎస్సార్‌ రైతు భరోసా అని రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసిందని, వైఎస్సార్‌ రైతు భరోసా పేరును తాటికాయంత అక్షరాలతో ముద్రించి, పీఎం కిసాన్‌ అనే పేరును కనిపించీ కనిపించనట్లుగా ముద్రిస్తున్నారన్నారు. రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500, కేంద్ర ప్రభుత్వం రూ. 6,500 ఇస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్నట్లు తెలుసుకొని రూ. 5,300 కోట్లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లుగా తెలిసిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి ప్రచారం కల్పించే ప్రకటనల్లో ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో, మరో వైపు ముఖ్యమంత్రి ఫొటో వేసుకోవచ్చన్నారు. అలా కాకుండా జేబులో నుంచి సొమ్ము తీసి ఇచ్చినట్లుగా బిల్డప్‌ ఇస్తూ, తన తండ్రి ఫొటో, తన ఫొటో ముద్రించుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై తమ పార్టీ నాయకులు కూస్తున్న కారు కూతలు వింటే బాధనిపిస్తోందని తెలిపారు. ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన మహిళ గురించి అనుచితంగా మాట్లాడినా పట్టించుకోకపోతే, మహిళలకు ముఖ్యమంత్రి ఇస్తున్న రక్షణ ఏమిటని ఎంపీ ప్రశ్నించారు. ఒక మహిళను అవమానిస్తే ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ అవమానమేనన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానానికి తెదేపా- జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని