భారాసది దోపిడీ.. కాంగ్రెస్‌ది లూటీ

దేశంలో మార్పు కోసం ఒక్కటే గ్యారంటీ ఉందని.. అది మోదీ గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇచ్చిన మాటను తప్పక నెరువేరుస్తామని.. దీన్ని ఇప్పటికే చేసి చూపించామని పేర్కొన్నారు. గత పదేళ్లుగా తెలంగాణను భారాస మహా దోపిడీ చేసిందన్నారు.

Updated : 17 Mar 2024 07:07 IST

ఆ రెండు పార్టీలు అవినీతిలో భాగస్వాములు
తెలంగాణ అభివృద్ధి కలల్ని ఆ పార్టీలు దూరం చేశాయి
నాగర్‌కర్నూల్‌ విజయసంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ
అభివృద్ధికి ‘నాదీ గ్యారంటీ’ అని వెల్లడి

ఈనాడు, మహబూబ్‌నగర్‌: దేశంలో మార్పు కోసం ఒక్కటే గ్యారంటీ ఉందని.. అది మోదీ గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇచ్చిన మాటను తప్పక నెరువేరుస్తామని.. దీన్ని ఇప్పటికే చేసి చూపించామని పేర్కొన్నారు. గత పదేళ్లుగా తెలంగాణను భారాస మహా దోపిడీ చేసిందన్నారు. భారాస నేతలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అత్యంత అవినీతిపరులతో భాగస్వామ్యం పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ గుప్పిట్లో చిక్కుకుందని చెప్పారు. రాష్ట్రాన్ని లూటీ చేసేందుకు ఐదేళ్ల సమయం సరిపోతుందని ఆ పార్టీ భావిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ తీరుతో రాష్ట్రం పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌లో జరిగిన భాజపా విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
కుటుంబ పార్టీలైన కాంగ్రెస్‌, భారాసలు.. అవినీతిలో భాగస్వాములని, కాంగ్రెస్‌ 2జీ కుంభకోణానికి, భారాస నీటి కుంభకోణానికి పాల్పడ్డాయని.. రెండు పార్టీలూ భూమాఫియాకు అండగా ఉన్నాయని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన వారెవర్నీ వదలబోమని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమకు తెలంగాణ ఆశీర్వాదం కావాలని కోరారు. గత పదేళ్లుగా కాంగ్రెస్‌, భారాసలు తెలంగాణ అభివృద్ధి కలల్ని దూరం చేశాయన్నారు. ఈ రెండు పార్టీల నడుమ తెలంగాణ నలిగిపోయిందని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓట్ల సంఖ్యను ప్రజలు రెండింతలు చేశారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు ఇస్తారన్న నమ్మకముందని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల షెడ్యూలు వెలువడిందని.. దీనికి ముందే ‘ఈసారీ మోదీ సర్కారు’ అని ప్రజలు ఫలితాల్ని ప్రకటించేశారని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం పేరిట రాజకీయమా?

‘‘భాజపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు, రైతులకు లబ్ధి చేకూరింది. కాంగ్రెస్‌, భారాసలు ఈ పథకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. గతంలో అంబేడ్కర్‌ను ఓడించేందుకు, ఆదివాసీ వర్గానికి చెందిన ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు ప్రయత్నాలు చేశాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం పేరు చెప్పి ఈ రెండు పార్టీలు రాజకీయ రొట్టెలు కాల్చుకుతిన్నాయి. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం డిప్యూటీ సీఎంను ఎలా అవమానించిందో ప్రజలు ఫొటోల్లో చూశారు. ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడ్ని నేలపై కూర్చోబెట్టారు. భారాస.. కాంగ్రెస్‌ అడుగుజాడల్లో నడిచే పార్టీ. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలనడం.. అంబేడ్కర్‌ను అవమానించడమే. దళితబంధు పేరిట దళితుల్ని మోసం చేసి వారి కళ్లలో మట్టి కొట్టింది. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి పదవిని దళితులకు ఇస్తామన్న భారాస(అప్పటి తెరాస) ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. రాష్ట్రంలో మాదిగ సామాజికవర్గాన్ని బలోపేతం చేసేందుకు మేము ప్రారంభించిన ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇది మోదీ గ్యారంటీ.

తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలి

తెలంగాణ.. దక్షిణ భారతదేశానికి ముఖద్వారం. గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేశాను. తెలంగాణ ప్రజల మనసులోని మాటను ఇక్కడ హాజరైన నాగర్‌కర్నూల్‌ ప్రజలు చెబుతున్నారు. శుక్రవారం మల్కాజిగిరిలో నిర్వహించిన రోడ్‌ షోలో ప్రజల అద్భుత ఆదరాభిమానాలు లభించాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు సహా పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చి భాజపాను అభ్యర్థులను ఆశీర్వదించారు. తెలంగాణ మనసులోని మాట దిల్లీకి చేరాలంటే వచ్చే ఎన్నికల్లో భాజపా అభ్యర్థులందరూ గెలవాలి. భాజపా ఎంపీలుంటే.. మీ కష్టసుఖాలు, ఆకాంక్షలు వేగంగా మాకు చేరుతాయి. తద్వారా మీకు మరింత సేవ చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆ హామీ నేను ఇస్తున్నా. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో తెలంగాణ యువత, మహిళలు, కార్మికుల ఆశీర్వాదం కావాలి. అవినీతిపరులకు శిక్ష పడటంలో తెలంగాణ ప్రజల సహకారం కావాలి. నా ప్రసంగాలను తెలుగులో వినాలంటే ఏఐ సహకారంతో సామాజిక మాధ్యమాల్లో ‘నమోఇన్‌తెలుగు’లో లభిస్తాయి.

ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ అబద్ధాలు.. దోపిడీ

కాంగ్రెస్‌ ఏడు దశాబ్దాలుగా దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పడం, దోపిడీ చేయడం తప్ప ఏమీ చేయలేదు. తెలంగాణను ఎప్పుడూ అభివృద్ధి చేయలేదు. దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన(గరీబీ హఠావో) నినాదం ఇస్తోంది. కానీ పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంది. దేశ ప్రజలు మోదీని ఆశీర్వదించిన తరువాత ఈ వర్గాల్లో మార్పు వచ్చింది. తొలిసారిగా కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు, పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, నల్లాల ద్వారా మంచినీరు, ఉచిత వ్యాక్సిన్‌ పేదల దరికి వచ్చాయి. లక్షల గ్రామాల్లో తొలిసారి రాత్రిపూట వెలుగులు(విద్యుత్తు కనెక్షన్లు) వచ్చాయి. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. గత పదేళ్లలో ఈ మార్పు వచ్చింది. ఈ తరహా మార్పు తెలంగాణలోనూ రావాలి. భాజపా పథకాల లబ్ధి రాష్ట్ర ప్రజలను చేరాలి. గత పదేళ్లలో తెలంగాణ పేదల కోసం కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం. కోటీ 50 వేల మందికి టీ కన్నా తక్కువ ధరకు రూ.20 ప్రీమియంతో బీమా సదుపాయం కల్పించాం. 67 లక్షల మంది చిన్నవ్యాపారులకు ముద్రా రుణాలు, 80 లక్షల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద వైద్యసేవల సదుపాయం కల్పించాం.

కుర్చీలు, బ్యాంకు బ్యాలెన్సుల కోసం కాదు..

కుటుంబ సభ్యులకు కుర్చీలు, బ్యాంకు బ్యాలెన్సుల కోసం పనిచేయాల్సిన అవసరం మోదీకి లేదు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబ సభ్యులే. గత 23 ఏళ్లుగా సీఎంగా, ప్రధానిగా సేవ చేసేందుకు ప్రజలు అవకాశమిచ్చారు. వాటిలో ఒక్కరోజూ నా సొంతం కోసం ఉపయోగించుకోలేదు. ఏం చేసినా.. 140 కోట్ల మంది సొంత కుటుంబ సభ్యుల కోసమే. మోదీ చెబితే ఆర్టికల్‌ 370 రద్దు అవుతుంది. రాముడు తన సొంతింటికి వస్తారంటే.. నిజమవుతుంది. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందంటే.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ మనదవుతుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని