ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు

‘‘ప్రజాజీవితంలో ఓడినా, గెలిచినా ఒక్కతీరుగా ఉండాలి. మన ప్రజలు.. మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకు సాగాలి’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అటు ఓటేశారని... ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

Updated : 19 Mar 2024 03:55 IST

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆశపడి మోసపోయారు
ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తా
బీఎస్పీ నేతల చేరిక సందర్భంగా భారాస అధినేత కేసీఆర్‌

ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే, గజ్వేల్‌: ‘‘ప్రజాజీవితంలో ఓడినా, గెలిచినా ఒక్కతీరుగా ఉండాలి. మన ప్రజలు.. మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకు సాగాలి’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అటు ఓటేశారని... ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పలువురు నాయకులు, అభిమానులతో సహా సోమవారం  భారాస పార్టీలో చేరారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి ప్రవీణ్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ  అగాధంలో ఉన్న తెలంగాణకు భారాస పాలనలో ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. ‘‘ఇవి ఎక్కడికీ పోవు.. కొత్తగా వచ్చే ప్రభుత్వం ఎక్కువిస్తుందేమోనని ఆశతో ప్రజలు మోసపోయారు. ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు. గాడిద వెంట పోతేనే కదా.. గుర్రాల విలువ తెలుస్తుంది’’ అని అన్నారు.

దళితబంధుపై విశ్లేషించాలి...

కేసీఆర్‌ మాట్లాడుతూ..‘‘కోటానుకోట్ల బహుజనులకు చైతన్య స్రవంతి కోసం మీరు ఆలోచన చేసిన వాళ్లు. మనకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలి. ఈమధ్య నిర్వహించిన సమీక్షల్లో మన వాళ్లు చెప్పిన అంశాలు ఆశ్చర్యం కలిగించాయి. దళితబంధు పథకంతో మనకు దెబ్బపడ్డదని అంటున్నారు. కానీ అలాంటి ఆలోచన సరికాదు. దళితబంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయి. దళిత సమాజం దీన్ని సానుకూలంగా ఎందుకు తీసుకోలేకపోయిందో బహుజన యువ మేధావులు విశ్లేషించాలి. దళిత, బహుజన శక్తి కలిసిపోవాలనే సిద్ధాంతం కోసం కాన్షీరాం పోరాడారు. దాన్ని మనం కొనసాగించాలి. పాలకులపై ఐకమత్యంతో పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలి. అగ్రవర్ణాల్లోని పేదలను కూడా కలుపుకొనిపోవాలి. 20 శాతం ఉన్న దళితులు ఐక్యంగా నిలబడితే సాధించలేనిదేమీ లేదు.

శూన్యం నుంచి సుడిగాలిని సృష్టించాం...

రాజకీయాల్లో ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకొని, నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలి. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నేను తిన్నన్ని తిట్లు ఎవరూ తినలేదు. రూ.5వేల కోట్లు ఇస్తామని సమైక్యవాదులు ప్రలోభాలు పెట్టినా.. తెలంగాణ వాదాన్ని వదల్లేదు. శూన్యం నుంచి సుడిగాలిని సృష్టించాం. ఇటువంటి సమస్యలెన్నో చూశాం. ఇదో లెక్కకాదు. మీలాంటి యువ నాయకత్వం ఎదిగితే.. ఈ వచ్చిపోయే చిల్లర, స్వార్థపరుల అవసరం ఉండదు. ఉద్యమకాలంలో అనివార్యంగా కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప.. మరీ ఇలా అసభ్యంగా బూతు కూతలకు దిగలేదు. మనం ఇచ్చిన నీళ్లు, కరెంటు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం. మనం కష్టపడితే.. 100 శాతం అద్భుతమైన విజయం సాధిస్తాం’’ అని కేసీఆర్‌ అన్నారు. భారాస పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌ను త్వరలోనే ప్రకటిస్తానని.. భవిష్యత్తులో కూడా ఆయన ఉన్నత స్థానంలో ఉంటారని ఈ సందర్భంగా  కేసీఆర్‌ పేర్కొన్నారు. 

ఒత్తిడి తెచ్చినా నిర్ణయం మార్చుకోలేదు: ప్రవీణ్‌కుమార్‌

భారాసలో చేరిన సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘పొత్తు రద్దు చేసుకొమ్మని మాయావతి నాపై ఒత్తిడి తెచ్చారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే భారాసలో చేరాలని నిర్ణయించుకున్నా. మా కార్యకర్తలు ఆర్థికంగా పేదలు కావచ్చు కానీ సైద్ధాంతికంగా కాదు. రాష్ట్రమంతా తిరిగి బహుజనవాదాన్ని ప్రచారం చేస్తాం. నేను ఎటువంటి ప్యాకేజీలకూ లొంగేవాడిని కాదు. నేను ఏమీ ఆశించి భారాసలో రాలేదు. అలా ఆశించే వాడిని అయితే కాంగ్రెస్‌ పార్టీలోకే వెళ్లేవాడిని. సీఎం రేవంత్‌రెడ్డి నన్ను సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. మీరు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో నేనూ ఒక్కణ్ని కాలేను. సీఎం రేవంత్‌రెడ్డి నాకు టీఎస్‌పీఎస్‌సీ పదవి ఆఫర్‌ ఇచ్చిన మాట వాస్తవమే. నేను తిరస్కరించాను’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని