YSRCP: 10 రోజులకే మార్చారు!

వైకాపా 175 శాసనసభా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా ప్రకటించిన 10 రోజులకే ముఖ్యమంత్రి జగన్‌ అందులో మళ్లీ మార్పులు చేశారు.

Updated : 27 Mar 2024 07:31 IST

ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు అనకాపల్లి లోక్‌సభకు
ఆయన కుమార్తె అనురాధకు మాడుగుల

ఈనాడు, అమరావతి: వైకాపా 175 శాసనసభా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా ప్రకటించిన 10 రోజులకే ముఖ్యమంత్రి జగన్‌ అందులో మళ్లీ మార్పులు చేశారు. మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బూడి ముత్యాలనాయుడు మళ్లీ అక్కడే పోటీ చేస్తారంటూ ఈ నెల 16న ప్రకటించారు. కానీ, ఆయనను మంగళవారం హఠాత్తుగా అనకాపల్లి లోక్‌సభ స్థానానికి మార్చారు. మాడుగుల సమన్వయకర్తగా ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లే అనురాధను నియమించారు. ఈ మార్పులను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈసారి తాను పోటీ చేయబోనని..తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మాడుగుల సీటును కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలైన తన కుమార్తెకు ఇవ్వాలని గత కొంతకాలంగా ముత్యాలనాయుడు సీఎంను కోరుతూనే ఉన్నారు. ‘ఈ సారి కుదరదు..ఇప్పుడు నువ్వే పోటీలో ఉండు...వచ్చే ఎన్నికల్లో మీ కుమార్తెకు ఇద్దాం’ అని సీఎం స్పష్టం చేయడంతో ఇష్టం లేకపోయినా సీఎం చెప్పారని ముత్యాలనాయుడు పోటీకి సిద్ధమయ్యారు.

ఈ నెల 16న ఆయన పేరునూ ప్రకటించారు. ఈ నెల 16న అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు అనకాపల్లి లోక్‌సభ స్థానాన్ని మాత్రం ఖాళీగా పెట్టారు. మరోవైపు సిటింగ్‌ ఎంపీ డాక్టర్‌ సత్యవతి ఈ సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో..మళ్లీ లోక్‌సభకే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారంటూ ఆమె వర్గీయులు చెబుతున్నారు. ఇదే సమయంలో అనకాపల్లి లోక్‌సభ సీటును పిళ్లా రమాకుమారి (విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆడారి ఆనంద్‌ సోదరి) పేరు దాదాపు ఖరారు చేశారని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే అటు సిటింగ్‌ ఎంపీ సత్యవతికి మొండిచెయ్యి చూపడంతోపాటు.. రమాకుమారి పేరును పక్కన పెట్టేస్తూ ముత్యాలనాయుడి పేరును మంగళవారం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని