ఓట్లు దండుకోవడానికే రుణమాఫీ ప్రకటన

లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Published : 16 Apr 2024 02:57 IST

డిసెంబరు 9నే అమలు చేయనందుకు రైతులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి
మాజీ మంత్రి హరీశ్‌రావు

ఈనాడు-హైదరాబాద్‌, గద్వాల కలెక్టరేట్‌-న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రుణమాఫీపై భారాస చేసిన పోరాటానికి భయపడి.. ప్రజలను మభ్యపెట్టడానికే సీఎం ఈ ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. డిసెంబరు 9నే రూ.2 లక్షల రుణమాఫీపై తొలి సంతకం పెడతానని గతంలో గొప్పలు చెప్పిన సీఎం.. ఇచ్చిన మాట తప్పినందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు హరీశ్‌రావు సోమవారం రాత్రి ‘ఎక్స్‌’లో స్పందించారు. అంతకుముందు గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జలదీక్షకు సంఘీభావంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

‘‘ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. ఇంకా ఎందుకు ఇవ్వలేదు? వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఎందుకు ఇవ్వడం లేదు? మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమైంది? పింఛన్లను       రూ.4 వేలకు ఎప్పుడు పెంచుతారు? ఆడపిల్లలకు తులం బంగారం, నిరుద్యోగ భృతి లాంటి ఎన్నో హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మరిచిపోయింది. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి లేని సర్కారు.. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఓడిపోతామనే భయంతో మళ్లీ కొత్తగా హామీలు ఇస్తోంది. ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు నమ్మకం కోల్పోయారు.

కర్ణాటక ప్రభుత్వంతో ఎందుకు చర్చించరు?

సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలేశారు. కాంగ్రెస్‌ కండువాలు పట్టుకుని భారాస నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. పాలన చేతకాకపోవడంతోనే నాలుగు నెలల్లోనే తాగు, సాగునీరు, విద్యుత్‌ కష్టాలు వచ్చాయి. పాత కాంగ్రెస్‌ రోజులను గుర్తుతెస్తున్నారు. నడిగడ్డలో గతంలో తాగునీటి కోసం ప్రజలు గోసపడే పరిస్థితి వస్తే సాగునీటి శాఖ మంత్రి హోదాలో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి.. నారాయణపూర్‌ డ్యాం నుంచి నీరు విడుదల చేయించాను. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 21 టీఎంసీల నీళ్లున్నాయి. ఆ ప్రభుత్వంతో రాష్ట్ర సర్కారు ఎందుకు చర్చించడం లేదు? ప్రజల అవసరాల కోసం 5 టీఎంసీలు విడుదల చేయించలేరా? తాగునీటి సమస్యను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి జలదీక్ష చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో గత భారాస ప్రభుత్వ హయాంలోనే పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి.. 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. నడిగడ్డ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గట్టు ఎత్తిపోతల పనులు ప్రారంభించాం.

భాజపా నేతల దీక్షలను రైతులు నమ్మరు..

భాజపా నాయకులు ఒకరి తరువాత ఒకరు చేపడుతున్న రైతు దీక్షలు బూటకం. భారాస నాయకుల దీక్షలను వారు కాపీ కొడుతున్నారు. రైతు ఉద్యమాలపై ఉక్కుపాదం మోపి, లాఠీఛార్జీ చేసినవారు దీక్షలు చేపడితే రైతులు నమ్మరు’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, భారాస నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని