icon icon icon
icon icon icon

BJP-JDS Alliance: హాసన సెక్స్‌ కుంభకోణం.. భాజపా-జేడీఎస్‌ కూటమిపై ప్రభావం ఎంత?

కర్ణాటక రాజకీయాల్లో హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అసభ్యకర వీడియోల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. భాజపా-జేడీఎస్‌ కూటమిపై దీని ప్రభావం ఎలా ఉండనుంది..?

Published : 30 Apr 2024 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అసభ్యకర వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో మనుగడ కోసం పోరాడుతున్న జేడీఎస్‌ ప్రతిష్ఠను ఇది దెబ్బతీస్తోంది. మరోవైపు ఆ పార్టీతో పొత్తులో ఉన్న భాజపాకు ఇది ఇబ్బందికర అంశమే. దీంతో ఆ పార్టీ ఈ వ్యవహారానికి దూరంగా ఉంటూ వస్తోంది. మరోవైపు ఈ అంశం కూటమిపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందోనని ఇరు పార్టీల నేతలు ఆందోళనలో ఉన్నారు.

ఉత్తర కర్ణాటకలో నాలుగో దశలో ఎన్నికల పోలింగ్‌ మే7న జరగనుంది. ఈనేపథ్యంలో ఈ వ్యవహారం కూటమికి ఇబ్బందికర అంశమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ఏర్పాటుచేసిన సిట్‌ బలమైన ఆధారాలను సేకరించకపోతే ఇది రాజకీయంగా అంతగా ప్రభావం చూపించదని చెబుతున్నారు. దక్షిణ కర్ణాటకలో పోలింగ్‌కు ముందు ఈ వ్యవహారం ఇప్పుడు ఉన్నట్లు ప్రకంపనలు సృష్టించి ఉంటే.. దీని పరిణామాలు వేరేవిధంగా ఉండేవని చెబుతున్నారు.

మరోవైపు ఈ వ్యవహారం నుంచి మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి దూరం జరిగారు. అది పూర్తిగా రేవణ్ణ కుటుంబానికి సంబంధించిన అంశమన్నారు. దానితో తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రజ్వల్‌ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ.. దీన్ని కుట్రగా కొట్టిపారేశారు. వాళ్లు విడుదల చేసిన వీడియోలు 4-5 ఏళ్ల క్రితం నాటివని పేర్కొన్నారు.

ప్రజ్వల్‌ సస్పెండ్‌కు రంగం సిద్ధం..

మంగళవారం పార్టీ కోర్‌ కమిటీ మీటింగ్‌లో నిర్ణయించిన అనంతరం ప్రజ్వల్‌ను సస్పెండ్‌ చేయనున్నట్లు కుమారస్వామి తెలిపారు. ‘‘ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. రేపు జరిగే కోర్‌ కమిటీ సమావేశంలో దీన్ని ప్రతిపాదిస్తాం. ప్రజ్వల్‌ లోక్‌సభ సభ్యుడు. దిల్లీ నుంచే నిర్ణయం తీసుకోవాలి’’ అని వెల్లడించారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష ఎదుర్కోవాల్సిందేనన్నారు. తాము ఎవరినీ రక్షించడం లేదని చెప్పారు. దీనిపై సిట్‌ ఏర్పాటుచేశారని.. నిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు.

లైంగిక దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఒక మహిళ  ఫిర్యాదు మేరకు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు, ఎమ్మెల్యే రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణలపై హొళెనరసీపుర పోలీసుస్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. లైంగిక దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే హాసన జిల్లాలో వైరల్‌ అవుతున్నాయి. కర్ణాటక మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ నాగలక్ష్మి చౌదరి సిఫార్సు మేరకు ఈ అంశంపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img